న్యూఢిల్లీ: భారతదేశ ఆటోమొబైల్, ఆటో విడిభాగాల కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నాయని క్రెడిట్ రేటింగ్ సంస్థ ‘బ్రిక్‌వర్క్ రేటింగ్స్’ తన రిపోర్ట్‌లో పేర్కొంది. 2026–27 నుంచి 2028–29 మధ్యకాలంలో దేశంలో దాదాపు రూ. 70,300 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని వెల్లడించింది.
ఈ రిపోర్ట్ ప్రకారం, మొత్తం రూ.4.76 లక్షల కోట్ల విలువైన 184 ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉండగా, ఇందులో భాగంగానే రానున్న మూడేళ్లలో రూ.70,300 కోట్ల క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ జరగనుంది. ప్రస్తుతం 70 ప్రాజెక్టులు వేగంగా అమలవుతున్నాయి.
ఆటో రంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆపరేటింగ్ ప్రాఫిట్ 8శాతం పెరిగి, ఇబిటా మార్జిన్లు 14 శాతానికి చేరుకోనున్నాయి. ‘‘ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ బండ్ల అమ్మకాలు మొత్తం బండ్ల సేల్స్‌లో 8.6 శాతానికి పెరిగింది. 2019–20 లో ఇది కేవలం 0.8శాతం మాత్రమే” అని బ్రిక్‌వర్క్ రిపోర్ట్ పేర్కొంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 3.02 కోట్ల వాహనాలు అమ్ముడవగా, 71 లక్షల వాహనాలు ఎగుమతి అయ్యాయని తెలిపింది.
