అంతర్జాతీయంగా ముదురుతున్న యుద్ధం వల్ల ఏర్పడిన చమురు సంక్షోభం మధ్య అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేరు స్టాక్ మార్కెట్‌లో హాట్ టాపిక్ గా మారాయి. మార్కెట్ మొత్తం నష్టాల్లో ఉన్నప్పటికీ.. ఈ షేరు గురువారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఏకంగా 15 శాతం మేర లాభపడి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. గృహ అవసరాలకు వాడే పీఎన్‌జీ, వాహనాలకు వాడే సీఎన్‌జీ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వచ్చిన వార్తలతో కంపెనీ షేర్లకు రెక్కలు వచ్చాయి.
నేడు ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో అదానీ టోటల్ గ్యాస్ షేరు ఒకానొక సమయంలో 14.8 శాతం లాభంతో రూ.651 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. ఉదయం 10:20 గంటల సమయానికి నిఫ్టీ 50 సూచీ 1 శాతం నష్టపోయినప్పటికీ.. ఈ గ్యాస్ స్టాక్ మాత్రం 11.2 శాతం లాభంతో రూ.630 వద్ద ట్రేడయింది. గత 3 ట్రేడింగ్ సెషన్లలోనే ఈ స్టాక్ ఏకంగా 35 శాతం పెరగడం గమనార్హం. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.69వేల 640 కోట్లుగా ఉంది. గ్యాస్ స్టాక్స్ గత 30 రోజుల సగటు ట్రేడింగ్ వాల్యూమ్ కంటే 70 రెట్లు అధికంగా ఈ షేర్లు ట్రేడవుతున్నాయి.
►ALSO READ | గ్యాస్ కస్సు బుస్సు : జొమాటో, స్విగ్గీలు ఒక్కొక్కరికీ 10 వేల రూపాయలు ఇవ్వాలి.. !
అయితే ఈ అద్భుతమైన ర్యాలీ వెనుక ఒక కీలకమైన సవాలు కూడా దాగి ఉంది. పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా సరఫరాదారులు గ్యాస్ కోత విధిస్తున్నట్లు అదానీ టోటల్ గ్యాస్ స్వయంగా ప్రకటించింది. దీనివల్ల ముఖ్యంగా పారిశ్రామిక వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. అయినప్పటికీ దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రస్తుతం అదానీ టోటల్ గ్యాస్‌కు సానుకూలంగా మారింది. దీంతో అదానీ టోటల్ స్టాక్ లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు మూడు రోజుల్లోనే దాదాపు రూ.35 వేల వరకూ లాభం వచ్చింది.
మిగిలిన గ్యాస్ కంపెనీల విషయానికి వస్తే.. ఇంద్రప్రస్థ గ్యాస్ షేరు 1.3 శాతం నష్టపోగా, మహానగర్ గ్యాస్ ఫ్లాట్‌గా ఉంది. మరోవైపు గెయిల్ 1.2 శాతం, గుజరాత్ గ్యాస్ 4 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. యుద్ధం వల్ల సరఫరా సమస్యలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం నుంచి లభిస్తున్న సపోర్ట్ అదానీ గ్యాస్ వంటి దిగ్గజ సంస్థలకు అదనపు బలాన్ని ఇస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో అదానీ స్టాక్ దూసుకుపోతున్న తీరు కూడా అదే రుజువు చేస్తోంది.
