ఐపీఎల్‌ 13 @ జులై-సెప్టెంబర్‌..?

ఐపీఎల్‌ 13 @ జులై-సెప్టెంబర్‌..?

కుదించే ప్లాన్‌‌ను పక్కనబెట్టిన బీసీసీఐ?
పూర్తి స్థాయి టోర్నీనే కోరుకుంటున్న బోర్డు, ఫ్రాంచైజీలు
జులై–సెప్టెంబర్‌‌ అందుకు అనువైన సమయంగా గుర్తింపు?
విదేశాల్లో నిర్వహించే ఆలోచన!

ముంబై: ఐపీఎల్​ పదమూడో సీజన్‌ను ఎలాగైనా పట్టాలెక్కించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. కరోనా ప్రభావంతో వచ్చేనెల 15 నుంచి కూడా లీగ్​ మొదలయ్యే అవకాశం లేకపోవడంతో ఇంకాస్త ఆలస్యంగా అయినా సరే పూర్తి స్థాయి టోర్నీ నిర్వహించాలని భావిస్తోంది.  ఇండియాలో వీలుకాకపోతే విదేశీ గడ్డపై నిర్వహించాలని,  అందరు ప్లేయర్లు అందుబాటులో లేకపోతే ఉన్న వాళ్లతో అయినా ముందుకెళ్లాలని బోర్డు పెద్దలు ఆలోచిస్తున్నారట. జులై-–సెప్టెంబర్‌‌ మధ్య కాలాన్ని పదమూడో సీజన్‌‌ నిర్వహణకు అనువైన సమయంగా ఎంచుకున్నట్టు సమాచారం.

ఐసీసీ ఫ్యూచర్‌‌ టూర్స్‌‌ ప్రోగ్రామ్‌‌ (ఎఫ్‌‌టీపీ)లో  జులై–సెప్టెంబర్‌‌ మధ్య క్రికెట్ యాక్టివిటీ తక్కువగా ఉంది. సెప్టెంబర్‌‌లో యూఏఈలో షెడ్యూల్‌‌ చేసిన ఆసియా కప్‌‌ (టీ20), ఇంగ్లండ్‌‌ తన సొంతగడ్డపై పాకిస్థాన్‌‌ సిరీస్, ఆపై పొరుగునే ఐర్లాండ్‌‌లో లిమిటెడ్‌‌ ఓవర్ల ఫార్మాట్‌‌ ఆడడం మినహా వేరే సిరీస్‌‌లు లేవు. అంతకుముందు ఇంగ్లిష్‌‌ సమ్మర్‌‌ (జూన్‌‌, జులై)లో ఇంగ్లండ్‌‌ అండ్‌‌ వేల్స్‌‌ క్రికెట్‌‌ బోర్డు (ఈసీబీ)… వంద బంతుల మ్యాచ్‌‌లతో కూడిన ‘ది హండ్రెడ్‌‌’ టోర్నమెంట్‌‌ను ప్రారంభించే ప్లాన్‌‌లో ఉంది. అయితే, ఇంగ్లండ్‌‌, పాకిస్థాన్‌‌ మినహాయిస్తే మిగతా పెద్ద దేశాలు ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌‌, న్యూజిలాండ్‌‌, సౌతాఫ్రికాలకు పెద్దగా సిరీస్‌‌ లేవు. ఇండియాతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌‌, అఫ్గానిస్థాన్‌‌ జట్లు ఆసియా కప్‌‌లో పాల్గొంటాయి. ఈ మెగా టోర్నీకి ముందు  ఇండియా మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం శ్రీలంక టూర్‌‌కు వెళ్లనుంది. ఇది జూన్, జులైలోనే జరగనుంది.

దాంతో, జులై, ఆగస్టు,సెప్టెంబర్‌‌ మధ్యలో లభించే ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోర్డు భావిస్తోంది.   వీలైతే విదేశాల్లో నిర్వహించే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది.‘2009లో  జనరల్‌‌ ఎలక్షన్స్‌‌ కారణంగా ఐపీఎల్‌‌ రెండో సీజన్‌‌ను సౌతాఫ్రికాలో 37 రోజుల్లోనే పూర్తయింది. అంటే ఐదు వారాల రెండు రోజుల్లోనే ఎడిషన్‌‌ ముగిసింది. ఇప్పుడు కూడా ఆ సమయం అందుబాటులో ఉంటే ఈ సీజన్‌‌లో కొంత భాగం ఇండియాలో, మరికొంత విదేశాల్లో నిర్వహించొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా అదుపులోకి వస్తే పూర్తి లీగ్‌‌ను ఫారిన్‌‌కు షిఫ్ట్‌‌ చేయొచ్చు. అయితే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కనీసం 37 రోజులు అందుబాటులో ఉండాల్సిందే. ఇందులో ఒక్కో వారం తగ్గితే తొమ్మిది నుంచి 11 మ్యాచ్‌‌లను కోల్పోవాల్సి ఉంటుంది’ అని ఐపీఎల్‌‌ వర్గాలు చెబుతున్నాయి.