IPL 2024:  సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ నుండి మిస్టరీ స్పిన్నర్ ఔట్

IPL 2024:  సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ నుండి మిస్టరీ స్పిన్నర్ ఔట్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా శ్రీలంక స్పిన్ ఆల్ రౌండర్ వనిందు హసరంగ ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. త్వరలోనే అతడు సన్‌రైజర్స్ హైదరాబాద్ క్యాంప్‌లో చేరతాడని భావించినప్పటికీ.. మొత్తం టోర్నీ నుంచే అతను వైలిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

ప్రస్తుతం హసరంగా ఎడమ మడమ గాయంతో బాధపడుతున్నాడు. ఇటీవల పాడియాట్రిస్ట్‌ను కలిసిన హసరంగా.. వారి సలహా మేరకు కొంత సమయం పునరావాసం చేయాల్సి ఉండటంతో ఐపీఎల్ నుండి వైదొలిగాడు. మడమలో వాపు ఉందని, ఇంజెక్షన్లతో అతను బాధపడుతున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు CEO ఆష్లే డి సిల్వా ఓ ప్రకటనలో తెలిపారు. అతను ఈ సమస్యను ప్రపంచ కప్‌కు ముందే పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. హసరంగా త్వరలోనే తన మడమ గాయానికి సంబంధించి నిపుణుడి సలహా తీసుకోవడానికి దుబాయ్ వెళ్లనున్నట్లు సమాచారం.

గతేడాది డిసెంబర్‌లో దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 1.50 కోట్ల రూపాయలకు వనిందు హసరంగాను కొనుగోలు చేసింది. ఈ మిస్టరీ స్పిన్నర్ ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడాడు. అదే జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనూ భాగమైనప్పటికీ.. ఐసీసీ ఆంక్షల నేపథ్యంలో రెండు టెస్టుల నిషేధాన్ని అనుభవిస్తున్నాడు.