IPL 2024: గంటకు 150 కి.మీ. వేగం.. లక్నో జట్టులోకి కివీస్ స్పీడ్ గన్

IPL 2024: గంటకు 150 కి.మీ. వేగం.. లక్నో జట్టులోకి కివీస్ స్పీడ్ గన్

లక్నోసూపర్ జెయింట్స్ మరో స్టార్ పేసర్‌ను అక్కున చేర్చుకుంది. వ్యక్తిగత కారణాల రీత్యా ఇంగ్లాండ్ పేసర్ డేవిడ్ విల్లీ ఐపీఎల్ టోర్నీ నుండి వైదొలగడంతో.. అతని స్థానంలో న్యూజిలాండ్ పేసర్ మాట్ హెన్రీని జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు లక్నోసూపర్ జెయింట్స్ అధికారిక ప్రకటన చేసింది.  

విల్లీ స్థానంలో లక్నో జట్టులోకి వచ్చిన మాట్ హెన్రీ నాణ్యమైన పేసర్. గంటకు 140 నుంచి 150 కి.మీ. వేగంతో బంతులు సంధించగల సమర్థుడు. అతని రాకతో లక్నోసూపర్ జెయింట్స్ బౌలింగ్ లైనప్ మరింత పటిష్టంగా మారింది. పేసర్లు షామర్ జోసెఫ్, నవీన్-ఉల్-హక్, ఆల్‌రౌండర్లు కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్ వంటి విదేశీ పేర్లను కలిగి ఉన్న లక్నో పేస్ అటాక్‌కు కివీస్ స్పీడ్ గన్ రాక అదనపు బలం. హెన్రీ గతంలో పంజాబ్ కింగ్స్, చెన్నైసూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే, ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు.

న్యూజిలాండ్ తరుపున ఇప్పటివరకు 131 టీ20లు ఆడిన హెన్రీ 8.39 ఎకానమీతో 151 వికెట్లు పడగొట్టాడు. 32 ఏళ్ల ఈ స్పీడ్ గన్ దేశం తరుపున 17 టీ20లు మాత్రమే ఆడారు. కివీస్ క్రికెట్ బోర్డు.. అతని సేవలను పొట్టి ఫార్మాట్‌తో పోలిస్తే వన్డే ఫార్మాట్‌లోనే ఎక్కువగా ఉపయోగించుకునేది. రైట్ ఆర్మ్ పేసరైన హెన్రీ 82 మ్యాచ్‌ల్లో 26.39 సగటుతో 141 వికెట్లు పడగొట్టాడు. 

బోణీ కొట్టేనా..!

తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం పాలైన లక్నోసూపర్ జెయింట్స్ జట్టు.. శనివారం పంజాబ్ కింగ్స్‌తో  తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఈ సీజన్‌లో శుభారంభం చేయాలని భావిస్తోంది. శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం(లక్నో) వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.