- 15 తులాల గోల్డ్, 1.50 లక్షలు కాజేసిన కొడుకు
- తల్లిదండ్రులు ఊరెళ్లిన టైమ్లో చోరీ
పద్మారావునగర్, వెలుగు: ఐపీఎల్ బెట్టింగ్ల కోసం సొంత ఇంట్లోనే ఓ వ్యక్తి దొంగగా మారాడు. తల్లిదండ్రులు ఊరెళ్లగా, ఇంటిని మొత్తం ఊడ్చేసి ఏమీతెలినట్టు నాటకమాడాడు. సికింద్రాబాద్ తిరుమలగిరి పరిధిలోని దుర్గా విహార్ కాలనీకి చెందిన సివిల్ కాంట్రాక్టర్ వెంకటేశ్వర్లు మార్చి 5న తన భార్యతో కలిసి ఏపీలోని స్వగ్రామానికి వెళ్లాడు. అదే బిల్డింగ్పెంట్హౌస్లో ఉండే ఆయన కొడుకు రాజు బెడ్ రూమ్ కిటికీ గ్రిల్స్ తొలగించి 15 తులాల బంగారం, రూ. 1.50 లక్షల నగదును కాజేశాడు. తన నేరం బయటపడకుండా ఉండేందుకు ఏప్రిల్ 27న తానే స్వయంగా తండ్రికి ఫోన్ చేసి కిటికీలు తెరిచి ఉన్నాయని నాటకమాడాడు.
బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా, అసలు విషయం బయటపడింది. క్యాబ్ డ్రైవర్గా పనిచేసే రాజు ‘డాఫా’ క్రికెట్ బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకుని ఈ చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. దొంగిలించిన బంగారంలో 12 తులాలను ముత్తూట్ ఫిన్కార్ప్లో తాకట్టు పెట్టి తెచ్చిన రూ. 12.5 లక్షలను కూడా మళ్లీ బెట్టింగ్లోనే పోగొట్టినట్లు తేలింది. నిందితుడిపై గతంలో కార్ఖానా, తిరుమలగిరి స్టేషన్లలో కేసులు ఉన్నాయి. నిందితుడి నుంచి 3 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకొని అతడిని చంచల్గూడ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
