ఐపీఎల్ హోంగ్రౌండ్‌లో ఆడించాలని టీమ్స్ గుస్సా

ఐపీఎల్ హోంగ్రౌండ్‌లో ఆడించాలని టీమ్స్ గుస్సా

వేదికలపై వివాదం

6 సిటీలనే ఎంపికచేయడంపై సన్‌‌రైజర్స్‌‌, పంజాబ్‌‌, రాజస్తాన్‌‌ టీమ్స్‌‌ గుస్సా

తమకు హోమ్‌‌ గ్రౌండ్​ అడ్వాంటేజ్‌‌ ఉండదని ఆవేదన

హోమ్‌‌టీమే లేని అహ్మదాబాద్‌‌ ఎందుకని ప్రశ్న!

కరోనా కారణంగా జరుగుతుందో లేదో అన్న అనుమానాలను దాటుకొని గత సీజన్‌‌ను యూఏఈలో విజయవంతంగా పూర్తి చేసిన బీసీసీఐకి ఈ ఏడాది ఐపీఎల్‌‌ నిర్వహణ  కత్తిమీద సాముగా మారేలా ఉంది. ఓ వైపు కరోనా భయం పూర్తిగా తొలగకున్నా 14వ సీజన్‌‌ను ఇండియాలోనే జరపాలని ప్లాన్‌‌ చేస్తున్న బోర్డు  ముందు ముళ్లదారి కనిపిస్తోంది. 2021 లీగ్‌‌ను ఆరు నగరాల్లో జరపాలని బీసీసీఐ భావిస్తుండగా.. దీనిపై కొన్ని ఫ్రాంచైజీల  నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. బోర్డు నిర్ణయంపై సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌, రాజస్తాన్‌‌ రాయల్స్‌‌, పంజాబ్‌‌ కింగ్స్‌‌ ఫ్రాంచైజీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమ సొంత అభిమానుల మధ్య ఆడే అవకాశాన్ని కోల్పోవడమే వాటి ఆగ్రహానికి కారణం. ఈ విషయంపై బీసీసీఐ సీఈవోకు ఫిర్యాదు చేశాయి.

ముంబై: పింక్‌‌ బాల్‌‌ టెస్టు కోసం అహ్మదాబాద్‌‌ వెళ్లిన బీసీసీఐ పెద్దలు ఐపీఎల్‌‌ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  చెన్నై, కోల్‌‌కతా, అహ్మదాబాద్‌‌, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వేదికలుగా 14వ సీజన్‌‌ను ‘కారవాన్‌‌ మోడల్‌‌’లో జరపాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ విషయంపై ఫ్రాంచైజీలకు ఇంకా అధికారిక సమాచారం ఇవ్వకపోయినప్పటికీ ఈ నెల 8వ తేదీలోపు జరిగే ఐపీఎల్‌‌ గవర్నింగ్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్‌‌లో దీనికి ఆమోద ముద్ర వేయాలని ఆలోచిస్తున్నారు. ముంబైలో మ్యాచ్‌‌ల నిర్వహణకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌‌ సిగ్నల్‌‌ కూడా లభించడంతో తాము అనుకున్న విధంగా ముందుకెళ్లాలని భావిస్తున్నారని సమాచారం. కానీ, ఈ విషయం తెలిసి హైదరాబాద్​, రాజస్తాన్​, పంజాబ్​ ఫ్రాంచైజీలు కంగుతిన్నాయి. ‘వేదికలు, షెడ్యూల్‌‌ గురించి ఐపీఎల్‌‌ గవర్నింగ్‌‌ కౌన్సిల్‌‌ ఇప్పటిదాకా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మీడియాలో వస్తున్న  కథనాలనే చూస్తున్నాం. అయితే, మా సొంత నగరాల్లో మ్యాచ్‌‌లను కోల్పోతే అది మా లోకల్‌‌ ఫ్యాన్స్‌‌ హార్ట్‌‌ బ్రేక్‌‌ అవుతుంది. గతేడాది కూడా లోకల్‌‌ ఫ్యాన్స్‌‌ ఐపీఎల్‌‌ లైవ్‌‌ యాక్షన్‌‌ను మిస్సయ్యారు. ఇలా వరుసగా రెండో ఏడాది మా సొంత సిటీల్లో  మ్యాచ్‌‌లు లేకుంటే ఎలా?.  ఈ పరిస్థితి గురించి మేం నిజంగా అప్సెట్‌‌ అవుతున్నాం’ అని బోర్డు షార్ట్‌‌లిస్ట్ చేసిన నగరాల జాబితాలో లేని ఫ్రాంచైజీకి చెందిన ఓఅధికారి ఆవేదన వ్యక్తం చేశారు.

బోర్డు సీఈవోకు ఫిర్యాదు

ఆరు వేదికలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సన్‌‌రైజర్స్‌‌, రాజస్తాన్‌‌, పంజాబ్‌‌ ఫ్రాంచైజీలు ఇప్పటికే బీసీసీఐ సీఈవో హేమంగ్‌‌ అమిన్‌‌ దృష్టికి తీసుకెళ్లినట్టు  సమాచారం. బోర్డు నిర్ణయంపై తమకున్న అభ్యంతరాలను వేర్వేరుగా అమిన్‌‌కు వివరించినట్టు తెలుస్తోంది. అలాగే, మూడు ఫ్రాంచైజీలు కలిసి అధికారికంగా ఫిర్యాదు చేయాలని కూడా భావిస్తున్నాయట. అయితే, దీనిపై మీడియాతో మాట్లాడేందుకు సదరు ఫ్రాంచైజీలు నిరాకరిస్తున్నప్పటికీ తమ ఆందోళన విషయాన్ని మాత్రం ఖండించడం లేదు. మరోవైపు అమిన్‌‌ కూడా దీనిపై స్పందించడం లేదు. ‘బోర్డు నిర్ణయం వల్ల మూడు జట్లపై  ప్రభావం పడుతుంది. ఈ మూడు టీమ్స్‌‌ తమ హోమ్‌‌గ్రౌండ్స్‌‌లో బాగా ఆడతాయి. హోమ్‌‌లో ఐదారు మ్యాచ్‌‌లు  గెలిచే అవకాశం ఉంది. బయట (ఇతర టీమ్స్‌‌ హోమ్‌‌ గ్రౌండ్‌‌)లో మరో రెండు మ్యాచ్‌‌లు నెగ్గినా సులభంగా ప్లే ఆఫ్స్‌‌కు చేరుకోవచ్చు. కానీ, ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. మరో ఐదు టీమ్స్‌‌ (రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు, చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌, కోల్‌‌కతా నైట్‌‌ రైడ్సర్‌‌, ఢిల్లీ క్యాపిటల్స్‌‌, ముంబై ఇండియన్స్‌‌)కు మాత్రం హోమ్‌‌ గ్రౌండ్‌‌ అడ్వాంటేజ్‌‌ ఉంటుంది. మేం మాత్రం అన్ని మ్యాచ్‌‌లూ బయటే ఆడాల్సి ఉంటుంది. ఇదెక్కడి న్యాయం’ అని ఓ ఫ్రాంచైజీ అధికారి పేర్కొన్నారు. కాగా, తమకు ఎందుకు అవకాశం లేదో చెప్పాలని  బీసీసీఐని అడిగినట్టు పంజాబ్​ కింగ్​ కో ఓనర్​ నెస్​ వాడియా తెలిపారు. ‘వేదికల నుంచి మమ్మల్ని  ఎందుకు మినహాయించారని బీసీసీఐని అడిగాం. రీజన్‌‌ తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఈ ప్రాసెస్‌‌ ఎలా వర్కౌట్‌‌ అవుతుందనే విషయంపై  పూర్తి సమాచారం ఇవ్వాలని కోరాం’ అని చెప్పారు. మరోవైపు రాజస్తాన్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై  బీసీసీఐతో తేల్చుకుంటాయని రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ భావిస్తోంది. అయితే, తెలంగాణ మంత్రి కేటీఆర్​ ట్వీట్​ను రీట్వీట్​ చేయడం తప్పితే సన్​రైజర్స్​ హైదరాబాద్​ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ముంబైలో కరోనా వేవ్‌‌, కోల్‌‌కతాలో ఎలక్షన్‌‌ వార్‌‌

ఐపీఎల్‌‌ కొత్త సీజన్‌‌ కోసం బీసీసీఐ ఎంచుకున్న ఆరు నగరాల్లో లీగ్‌‌ నిర్వహణకు అవాంతరాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మెగా లీగ్‌‌కు ఆతిథ్యం ఇచ్చే కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్‌‌ జరగనుండగా, మరికొన్నింటిలో కరోనా సెకండ్‌‌ వేవ్‌‌ నడుస్తోంది. ఏప్రిల్‌‌ 11 నుంచి లీగ్‌‌ స్టార్‌‌ చేయాలని బోర్డు భావిస్తుండగా.. అదే టైమ్‌‌లో తమిళనాడు, కోల్‌‌కతాలో అసెంబ్లీ ఎలక్షన్స్‌‌ జరగనున్నాయి. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌‌ 6న ఎలక్షన్స్‌‌ జరగనుండగా.. వెస్ట్‌‌ బెంగాల్‌‌లో మాత్రం 8 విడతల్లో ఎన్నికలు ఉంటాయి. మార్చి 27, ఏప్రిల్‌‌ 1, 6, 10, 17, 22, 26, 29వ తేదీల్లో ఎలక్షన్స్‌‌ షెడ్యూల్‌‌ చేశారు. 2019 జనరల్‌‌ ఎలక్షన్స్‌‌ టైమ్‌‌లోనూ  లీగ్‌‌ను సాఫీగా నిర్వహించిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలతో పెద్ద సమస్యేమీ ఉండబోదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కానీ, బెంగాల్‌‌లో రాజకీయ పరిస్థితులు కాస్త ఆందోళన కరంగా ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటికే అనేక ఉద్రిక్త ఘటనలు జరగ్గా… ఎలక్షన్‌‌ టైమ్‌‌లో ఆ హీట్‌‌ మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కోల్‌‌కతాలో మ్యాచ్‌‌ల నిర్వహణకు సమస్యలు రావొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర, కర్నాటకలో  కరోనా సెకండ్‌‌ వేవ్‌‌ ఆందోళన కలిగిస్తోంది.  పైగా, ఫ్యాన్స్‌‌ సమక్షంలో ఐపీఎల్‌‌ నిర్వహించాలని బోర్డు భావిస్తుండగా. .. ప్రేక్షకులను అనుమతించకపోతేనే ముంబైలో లీగ్‌‌కు పర్మిషన్‌‌ ఇస్తామని మహారాష్ట్ర గవర్నమెంట్‌‌ కండిషన్‌‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక,  సెకండ్‌‌ వేవ్‌‌ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్‌‌ కూడా ఉండడం గమనార్హం. పైగా, ఏ ఫ్రాంచైజీకి హోమ్‌‌ గ్రౌండ్‌‌ కాకున్నా.. అహ్మదాబాద్‌‌ను వేదికగా షార్ట్‌‌లిస్ట్‌‌ చేయడం కొందరికి అస్సలు నచ్చడం లేదు. అయితే, అహ్మదాబాద్‌‌ మొతెరా స్టేడియంలో కేవలం ప్లేఆఫ్స్‌‌, ఫైనల్స్‌‌ నిర్వహించాలని బోర్డు నిర్ణయించిందని తెలుస్తోంది.