
జూబ్లీహిల్స్, వెలుగు: ఐపీఎస్ ఆఫీసర్దివంగత చదలవాడ ఉమేశ్‌చంద్ర పోలీసులకు ఆదర్శనీయుడని సీఐడీ(మహిళా భద్రతా విభాగం) డీఐజీ సుమతి అన్నారు. గురువారం ఆయన వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎస్సార్ నగర్ చౌరస్తాలో ఉన్న ఉమేశ్‌చంద్ర విగ్రహానికి నివాళి అర్పించారు.
ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, తోటి సిబ్బంది కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఆయన పోలీస్వృత్తికి వన్నె తెచ్చారని కొనియాడారు. విధుల్లో ఉండగానే ఆయన మరణించడం సమాజానికి తీరని లోటన్నారు. ఏసీబీ డీఐజీ విజయ్ కుమార్, ఏసీపీ రాఘవేంద్రరావు, సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఉమేశ్‌చంద్ర తండ్రి వేణుగోపాలరావు, తల్లి నయనతార, పోలీస్‌సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.