ఘోర విమాన ప్రమాదం..

ఘోర విమాన ప్రమాదం..

బుధవారం ఉదయం టెహ్రాన్ విమానాశ్రయానికి సమీపంలో ఉక్రేయిన్‌కు చెందిన బోయింగ్ 737 విమానం కూలింది. అందులో ప్రయాణిస్తున్న 167 మంది ప్రయాణికులతో పాటు మరో 9 మంది ఫ్లైట్ సిబ్బంది కలిపి మొత్తం 176 మంది చనిపోయారు. ఈ విమానం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఆ ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఏ బాడీ ఎవరిదో గుర్తుపట్టడం కష్టంగా మారింది. సహాయక సిబ్బంది చనిపోయినవారి డెడ్‌బాడీలను మరియు శరీర భాగాలను కవర్లలో చుట్టి తరలిస్తున్నారు.

ఇరాన్‌లోని ఉక్రేయిన్ దేశ రాయబార కార్యాలయం ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను వెతికే పనిలో ఉంది. మరణించిన ప్రయాణికుల జాబితాను కూడా తెలియజేయడానికి రాయబార కార్యాలయం కృషి చేస్తోంది అని ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెన్స్కీ తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు. ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికులు మరియు విమాన సిబ్బంది కుటుంబాలకు ఆయన తన సంతాపం ప్రకటించారు.

ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఇరాన్ అత్యవసర వైద్య సేవల బృందం ఆ ప్రాంతానికి వెళ్లింది. కానీ ఆ ప్రాంతమంతా మంటల్లో ఉన్నందున వెంటనే తగు చర్యలు తీసుకోలేకపోయామని ఇరాన్ ఈఎమ్ఎస్ అధిపతి పిర్హోస్సేన్ కౌలివాండ్ తెలిపారు. విమానం టేకాఫ్ అయిన తర్వాత పరాంద్ మరియు షహర్యార్ నగరాల మధ్య కూలినట్లు ఆయన తెలిపారు.

ప్రమాదానికి గురైన విమానం సుమారు మూడున్నర సంవత్సరాలుగా తన సేవలను అందిస్తున్నట్లు సమాచారం. సాంకేతిక ఇబ్బందుల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఇరాన్ అధికారిక వార్తా పత్రిక తెలిపింది. మరికొద్ది రోజుల్లో ఉక్రేయిన్ ఎయిర్ లైన్స్‌కు కొత్త CEOగా డేవిడ్ కాల్హౌన్ బాధ్యతలు చేపట్టనున్నారు. పాత CEO డెన్నిస్ ముయిలెన్ బర్గ్ స్థానంలో డేవిడ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.