ట్రంప్, మస్క్ మధ్య కయ్యం.. పరిణామాలు తీవ్రంగా ఉంటయ్.. మస్క్కు ట్రంప్ వార్నింగ్

ట్రంప్, మస్క్ మధ్య కయ్యం.. పరిణామాలు తీవ్రంగా ఉంటయ్.. మస్క్కు ట్రంప్ వార్నింగ్
  • బడ్జెట్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామన్న డెమోక్రాట్లు
  • డబ్బులు ఇవ్వాలని డిమాండ్.. ఒప్పుకున్న మస్క్!

వాషింగ్టన్: డెమోక్రాట్లకు నిధులు సమకూరిస్తే బాగుండదని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్​ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ తీసుకొస్తున్న ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ను మస్క్ బహిరంగంగా వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య కయ్యం మొదలైంది. కాగా, ట్రంప్ తాజాగా ఎన్​బీసీ న్యూస్‌‌‌‌తో ఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

డెమోక్రాట్ అభ్యర్థులకు మస్క్ నిధులు సమకూరుస్తున్నట్లు తెలిసిందని, ఒకవేళ అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మస్క్​తో మాట్లాడటం ఇష్టం లేదని స్పష్టం చేశారు. అతనితో సత్సంబంధాలు కొనసాగించాలనే ఆలోచన తనకు లేదన్నారు. ఫ్రెండ్​షిప్కు ఫుల్​స్టాప్ పడిందన్నారు. స్పేక్ ఎక్స్తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై సమీక్షిస్తున్నామని చెప్పారు. ‘‘రిపబ్లికన్​లకు వ్యతిరేకంగా మస్క్ వ్యవహరిస్తున్నాడు.

కాంగ్రెస్‌‌‌‌లో ప్రవేశపెట్టిన వ్యయ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసే రిపబ్లికన్లను మస్క్ టార్గెట్ చేసినట్లు తెలిసింది. వాళ్లపై మస్క్ ఎలాంటి చర్యలు తీసుకున్నా నేను ఊరుకోను. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను తీసుకొస్తున్న బడ్జెట్ బిల్లును కొంత మంది డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్నారు. వాళ్లంతా మస్క్​ను కలిసినట్టు తెలిసింది. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. మస్క్ కూడా డెమోక్రాట్లకు డబ్బులు ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలిసింది. డెమోక్రాట్లకు డబ్బులు ఇవ్వొద్దు’’ అని ట్రంప్ హెచ్చరించారు. అయితే, మస్క్​పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మాత్రం ట్రంప్ చెప్పలేదు.

ట్రంప్ను పదవి నుంచి తొలగించాలి: మస్క్
ట్రంప్ చేసిన కామెంట్లపై సోషల్ మీడియా వేదికగా ఎలాన్ మస్క్ ఘాటుగా స్పందించాడు. వ్యక్తిగత విమర్శలు చేశాడు. తర్వాత వాటిని డిలీట్ చేశారు. ట్రంప్​ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాడు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్​కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలంటూ కామెంట్లు చేశారు.