లాస్​ఏంజెల్స్లో ఆగ్రహ జ్వాలలు.. అక్రమ వలసదారుల ఏరివేతను నిరసిస్తూ ఆందోళనలు

లాస్​ఏంజెల్స్లో ఆగ్రహ జ్వాలలు.. అక్రమ వలసదారుల ఏరివేతను నిరసిస్తూ ఆందోళనలు
  • నిరసనలు ఆపాలని హెచ్చరించిన ప్రెసిడెంట్ డొనాల్డ్​ ట్రంప్
  • ఇల్లీగల్ ​ఇమ్మిగ్రెంట్స్​ను వదిలిపెట్టబోమని వార్నింగ్​

కాలిఫోర్నియా: అమెరికాలోని లాస్​ఏంజెల్స్​లో రెండోరోజు నిరసనలు కొనసాగాయి. అక్రమ వలసదారుల ఏరివేతకు ఫెడరల్​ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలను వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. శనివారం ప్రారంభమైన నిరసనలు..రెండోరోజు ఆదివారం కూడా కొనసాగాయి. అక్రమ వలసదారుల అరెస్ట్‌‌‌‌ల నేపథ్యంలో వందలమంది ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి.. ట్రంప్‌‌‌‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.

పారామౌంట్, పొరుగున ఉన్న కాంప్టన్‌‌‌‌లో నిరసనలు మిన్నంటాయి. నిరసనకారులు ఓ కారుకు నిప్పంటించారు. పారామౌంట్‌‌‌‌లోని డోనట్ దుకాణం దగ్గర వందల మంది ప్రదర్శనకారులు గుమిగూడి నిరసన తెలిపారు. లాస్ ఏంజెల్స్​ డౌన్‌‌‌‌టౌన్‌‌‌‌లోని ఫెడరల్ భవనాల వెలుపల కూడా నిరసనకారులు ఆందోళన చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్‌‌‌‌, టియర్‌‌‌‌ గ్యాస్‌‌‌‌  ప్రయోగించి వారిని చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

ఆందోళన అణచివేతకు ట్రూప్స్​
అక్రమ వలసదారుల ఏరివేత నేపథ్యంలో ఫెడరల్‌‌‌‌ అధికారులు లాస్‌‌‌‌ ఏంజెల్స్​లో చేపట్టిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి.  మొత్తం 44 మంది అక్రమ వలసదారులను పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. ఈ క్రమంలోనే అక్కడ నిరసనలు చెలరేగాయి. నిరసన తెలుపుతున్న ఒక ప్రముఖ యూనియన్ నాయకుడిని అరెస్టు చేయడంతో స్థానికులు మండిపడ్డారు. సుమారు వెయ్యి మంది ఆందోళనకారులు రోడ్డెక్కడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై ట్రంప్​ తీవ్రంగా స్పందించారు. గవర్నర్ గవిన్ న్యూసమ్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా లాస్ ఏంజిల్స్‌‌‌‌కు 2 వేల కాలిఫోర్నియా నేషనల్ గార్డ్ దళాలను మోహరిస్తున్నట్టు ప్రకటించారు. 

నిరసనకారులకు ట్రంప్ వార్నింగ్
అక్రమ వలసదారుల ఏరివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ట్రంప్​ సీరియస్ అయ్యారు. ఈమేరకు ఆయన ‘ట్రూత్’లో పోస్ట్​ పెట్టారు.  ‘‘కాలిఫోర్నియా గవర్నర్‌‌‌‌ గావిన్‌‌‌‌ న్యూసమ్‌‌‌‌, లాస్‌‌‌‌ ఏంజెల్స్​ మేయర్‌‌‌‌ కరెన్‌‌‌‌ బాస్‌‌‌‌ తమ బాధ్యతలను నిర్వర్తించలేరనే విషయం అందరికీ తెలుసు. అందుకే ఫెడరల్‌‌‌‌ ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తున్నది. ఆందోళనకారులు, దోపిడీదారుల సమస్యను మేం పరిష్కరిస్తాం” అని వ్యాఖ్యానించారు. కాగా, లాస్‌‌‌‌ ఏంజెల్స్​ ఘటనను వైట్‌‌‌‌హౌస్‌‌‌‌ డిప్యూటీ చీఫ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ స్టీఫెన్‌‌‌‌ మిల్లర్‌‌‌‌ తీవ్రంగా ఖండించారు. ఇవి అమెరికా చట్టాలకు, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయని మండిపడ్డారు.