గుర్తు లేదు.. మర్చిపోయాం: హార్మూజ్‎లో మైన్స్ లోకేషన్ మర్చిపోయిన ఇరాన్..!

గుర్తు లేదు.. మర్చిపోయాం: హార్మూజ్‎లో మైన్స్ లోకేషన్ మర్చిపోయిన ఇరాన్..!

టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల వేళ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. హార్మూజ్ జల సంధిలో అమర్చిన మైన్స్ (మందు పాతరలు) లోకేషన్లను ఇరాన్ మర్చిపోయింది. అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఇరాన్ తాను అమర్చిన మందుపాతరలను గుర్తించి, తొలగించలేకపోవడంతో హోర్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. హార్మూజ్‎లో మందుపాతరలను చెల్లాచెదురుగా అమర్చారని.. ఇప్పుడు అవి ఎక్కడ ఉన్నాయో ఇరాన్‎కు కూడా తెలియదని నివేదికలో పేర్కొన్నారు. 

అమెరికా దాడుల్లో మైన్స్ అమర్చే, తొలగించే చిన్న పడవలను ఇరాన్ కోల్పోయిందని.. ఇప్పుడు మైన్స్ తొలగించే కెపాసిటీ ఇరాన్‎కు లేదని తెలిపింది. భూమిపై ఉండే మైన్‌లతో పోలిస్తే సముద్రంలో ఉండే మైన్‌లను తొలగించడం చాలా కష్టమని.. అమెరికా సైన్యానికి కూడా బలమైన మైన్ తొలగింపు సామర్థ్యాలు లేవని అధికారులు పేర్కొన్నారు. 

 ఒకవేళ మైన్స్ అమర్చిన లోకేషన్స్ గుర్తున్నప్పటికీ అందులో కొన్ని నీటిలో కొట్టుకుపోయి ఉంటాయని.. వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం సవాల్‎తో కూడుకున్న పని అని పేర్కొన్నారు. ఇటీవల ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌ (ఐఆర్జీసీ) చేసిన ప్రకటన కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. హార్మూజ్ గుండా వెళ్లే నౌకలు ఇరాన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని.. వారు సూచించిన మార్గంలోనే వెళ్లాలని ఐఆర్జీసీ సూచించింది. లేదంటే ఇరాన్ భద్రతా దళాలు అమర్చిన మైన్స్ పేలే అవకాశం ఉందని హెచ్చరించింది. 

మైన్స్ పెట్టిన లోకేషన్స్ వివరాలు లేకపోవడంతోనే ఇరాన్ ఈ హెచ్చరికలు చేసినట్లు స్పష్టం అవుతోంది. అమెరికా ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. యుద్ధం పూర్తిగా ముగించేందుకు ఏప్రిల్ 10న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‎లో అమెరికా ఇరాన్ ప్రతినిధుల బృందం శాంతి చర్చల జరపుంది. ఒకవేళ అమెరికా ఇరాన్ మధ్య డీల్ కుదిరి హార్మూజ్ జల సంధిని ఓపెన్ చేసిన మైన్స్ కారణంగా హార్మూజ్‎లో నౌకల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఇరాన్ మైన్స్ గుర్తించి తొలగించిన తర్వాతే హార్మూజ్‎లో ప్రయాణాలు సాఫీగా సాగుతాయి.  

2026, ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‎పై దాడులు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రైయిట్ ఆఫ్ హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. నౌకలు రాకపోకలు సాగించకుండా హార్మూజ్ జల సంధిలో ఇరాన్ భద్రతా దళాలు ఎక్కడికక్కడ మైన్స్ (మందు పాతరలు) అమర్చాయి.