- ఇప్పటికే సముద్రంలో ఆయిల్ ట్యాంకర్లు ఉన్నాయి
- 90 రోజులు ఆయిల్ సరఫరా చేయగలం: ఇరాన్
టెహ్రాన్: హార్మూజ్ జలసంధిని అమెరికా బ్లాక్ చేసినా తమకు ఇబ్బందిలేదని, మూడు నెలల వరకు ఎలాంటి ఆటంకాలులేకుండా ఆయిల్ సప్లై చేయగలమని ఇరాన్ పేర్కొంది. ఈ మేరకు బల్గేరియాలోని ఇరాన్ ఎంబసీ ‘ఎక్స్’లో ప్రకటించారు. హార్మూజ్ ద్వారా రవాణా చేసే ఇరాన్ నౌకలను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ‘‘ఇరాన్ ను బ్లాక్ చేస్తామని ట్రంప్ చెప్పారు.
సముద్రంలో చాలినన్ని ట్యాంకర్లను ముందుగానే ఉంచాం. దీంతో మూడు నెలల పాటు ఎలాంటి ఢోకా లేకుండా ఆయిల్ సప్లై చేయగలం. అన్ని నెలల పాటు మీరు, మీ మిత్రపక్షాలు తట్టుకుంటాయా? మీరు ఇరాన్ పోర్టులను బ్లాక్ చేయవచ్చు. కానీ, ఆయిల్ కోసం ఇరాన్ పై ఆధారపడిన దేశాల మాటేమిటి?” అని ఇరాన్ ఎంబసీ ట్వీట్ చేసింది. హార్మూజ్ ద్వారా ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూలు చేసి ఇరాన్ దోపిడీకి పాల్పడుతోందని, దీంతో హార్మూజ్ ను క్లోజ్ చేస్తామని ఇప్పటికే ట్రంప్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు విఫలమైన వెంటనే ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
కాగా.. ట్రంప్ కామెంట్లపై యూఎస్ కమాండ్ కంట్రోల్ సోమవారం క్లారిటీ ఇచ్చింది. హార్మూజ్ ను దిగ్బంధించడం లేదని, ఇరాన్ పోర్టుల నుంచి వచ్చే, ఆ పోర్టుకు వెళ్లే నౌకలను మాత్రమే తాము అడ్డుకుంటామని తెలిపింది. హార్మూజ్ ద్వారా అన్ని నౌకలు సురక్షితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది.
కాగా.. ఫిబ్రవరి 28న ఇరాన్, అమెరికా– ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత హార్మూజ్ జలసంధి మూతపడింది. దీంతో పలు దేశాల నౌకలు అందులోనే చిక్కుకున్నాయి. అయితే.. ఇజ్రాయెల్, అమెరికాతో పాటు వాటికి మద్దతు తెలిపిన దేశాలకు చెందిన నౌకలను మినహాయించి మిగతా దేశాల నౌకలు హార్మూజ్ ద్వారా ప్రయాణించడానికి ఇరాన్ అనుమతి ఇచ్చింది.

