టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం ముగింపే లక్ష్యంగా అమెరికా-ఇరాన్ రెండో దఫా చర్చలకు సిద్ధమవుతున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి. ఈ తరుణంలో అమెరికా ముందు ఇరాన్ కీలక డిమాండ్ పెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల తమకు దాదాపు రూ. 27 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఇరాన్ వెల్లడించింది. ఈ రూ. 27 వేల కోట్ల నష్ట పరిహారం సంగతి తేల్చాకే యుద్ధ విరమణ చర్చలు ఉంటాయని తేల్చిచెప్పింది.
రష్యాకు చెందిన ఆర్‌ఐఏ నోవోస్తి వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫాతిమా మొహజెరానీ మాట్లాడుతూ.. 2026, ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఇరాన్ సుమారు 270 బిలియన్ డాలర్ల ప్రత్యక్ష, పరోక్ష నష్టాన్ని చవిచూసిందని తెలిపారు.
అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు, గ్యాస్ కేంద్రాలు, పెట్రోకెమికల్ కంపెనీలు, ఉక్కు కర్మాగారాలు, అల్యూమినియం ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లు, ఎయిర్ పోర్టులు, వంతెనలు, ఓడరేవులు, రైల్వే నెట్‌వర్క్‌లు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు, అనేక విద్యుత్ కేంద్రాలు, నీటి శుద్ధి కర్మాగారాలు, పెద్ద సంఖ్యలో ఆసుపత్రులు, పాఠశాలల వంటి కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని తెలిపారు.
వీటిని పూర్తిగా పునర్నిర్మించడానికి సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు. 2026, ఏప్రిల్ 10న పాకిస్థాన్‌లో ఇరాన్-అమెరికా మధ్య జరిగిన చర్చల్లో కూడా పరిహారం అంశం లేవనెత్తామని చెప్పారు. భవిష్యత్తులో అమెరికాతో జరగబోయే ఏ చర్చల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని ఆమె తెలిపారు. రెండో దఫా చర్చలకు ముందు ఇరాన్ డిమాండ్‌పై అమెరికా ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలీ.

