ప్రపంచ దేశాలకు బిగ్ షాక్.. అమెరికాతో శాంతి చర్చలు నిలిపివేసిన ఇరాన్

ప్రపంచ దేశాలకు బిగ్ షాక్.. అమెరికాతో శాంతి చర్చలు నిలిపివేసిన ఇరాన్

టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరి పశ్చిమాసియాలో యుద్ధానికి ఎండ్ కార్డ్ పడుతుందనుకున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక చర్యలకు నిరసనగా ఇరాన్ అమెరికాతో పరోక్ష చర్చలను నిలిపివేసింది. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నంత కాలం దౌత్యం కొనసాగదని తేల్చిచెప్పింది ఇరాన్. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్య కొనసాగితే ప్రత్యక్ష ఘర్షణకు దిగుతామని ఇరాన్ హెచ్చరించింది. ముగింపు దశకు వచ్చిన పీస్ టాక్స్ ఇరాన్ నిర్ణయంతో అర్థాంతరంగా నిలిచిపోయాయి. దీంతో పశ్చిమాసియా కథ మళ్లీ మొదటికి వచ్చింది. 

నెతన్యాహుపై ట్రంప్ సీరియస్

అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు ముగింపు దశకు చేరుకున్న వేళ లెబనాన్‎పై దాడులు చేయడంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ట్రంప్ సీరియస్ అయ్యారు. ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేస్తున్నారని.. ఇరాన్‌తో అమెరికా దౌత్య ప్రయత్నాలకు ప్రమాదం కలిగిస్తున్నారని నెతన్యాహుపై ట్రంప్ మండిపడ్డారు. ప్రస్తుత పరిణామాలను పట్టించుకోకుండా పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నావని నెతన్యాహుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్.

‘‘నువ్వు అసలు ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా.. నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి.. నేను నిన్ను కాపాడుతున్నా. ఇప్పుడు అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. నీవు పిచ్చివాడిలా తయారయ్యావు’’ అని నెతన్యాహుపై ట్రంప్ చిందులు తొక్కారు. లెబనాన్‎పై దాడులు కొనసాగితే అది ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్‌ను మరింత ఏకాకిని చేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. తక్షణమే లెబనాన్‎పై దాడులు ఆపాలని ఇజ్రాయెల్‎ను ఆదేశించారు ట్రంప్.

ALSO READ : పిచ్చి పట్టిందా.. నేను లేకపోతే నిన్ను బొక్కలో వేసేటోళ్లు: నెతన్యాహుపై ట్రంప్ ఫైర్..!

లెబనాన్‎పై దాడులు ఆగవు:  నెతన్యాహు

లెబనాన్‎పై దాడులు ఆపాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలను ఇజ్రాయెల్ లైట్ తీసుకుంది. లెబనాన్‎తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నప్పటికీ దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ దళాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. హిజ్బుల్లా ఇజ్రాయెల్ నగరాలు, పౌరులపై కాల్పులు కొనసాగిస్తే సైనిక చర్య కొనసాగుతుందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ నిర్ణయంపై ట్రంప్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి మరీ..