టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ తమ దేశంపై యుద్ధం ప్రారంభించే అవకాశం ఉందని ఇరాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ చీఫ్ మొహమ్మద్ జాఫర్ అసదీ అన్నారు. అయితే, ఎలాంటి దాడి జరిగినా ఎదుర్కొనేందుకు తాము పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామన్నారు. అమెరికా ఎటువంటి ఒప్పందాలకు కట్టుబడి లేదని ఫైర్ అయ్యారు.
అమెరికా అధికారుల ఇటీవలి చర్యలు, ప్రకటనలు దౌత్యపరమైన అవగాహనలపై వారికి నిబద్ధత లేదని సూచిస్తున్నాయని ఆయన ఆరోపించినట్లు ఇరాన్ వార్తా సంస్థ ‘ఫార్స్’ వెల్లడించింది. ‘అమెరికా అధికారుల చర్యలు, ప్రకటనలు ప్రాథమికంగా మీడియా ప్రచారం కోసమే ఉంటున్నాయి. చమురు ధరలు తగ్గకుండా చూడటం, వారు సృష్టించిన గందరగోళం నుంచి బయటపడటం కోసమే వారు ఇలా వ్యవహరిస్తున్నారు’ అని అసదీ విమర్శించారు.
ఇరాన్ సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అమెరికన్లు చేసే ఎలాంటి కొత్త సాహసాలనైనా లేదా మూర్ఖపు పనులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. నిజానికి యుద్ధానికి ముందు చర్చల సమయంలో, ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చల్లో, ఆ తర్వాత కాల్పుల విరమణ సమయంలోనూ తాము తగినంత అనుకూలత చూపినా, అమెరికా వెనక్కి తగ్గలేదని తప్పుపట్టారు. ప్రతిసారీ ఇరాన్ తన డిమాండ్లను తగ్గించుకోగా, అమెరికన్లు మాత్రం మరింత దూకుడుగా వ్యవహరించారని చెప్పారు.
మరోవైపు, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం గురించి ట్రంప్ యంత్రాంగాన్ని జవాబుదారీతనం కోరడం అమెరికన్ల హక్కు, పవిత్ర బాధ్యత అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘‘ఈ యుద్ధం ఎలాంటి కవ్వింపు లేకుండా జరిగిన దురాక్రమణ. ఇరాన్ కు వ్యతిరేకంగా ఈ అక్రమ యుద్ధాన్ని చేస్తున్నందుకు, జరిగిన అన్ని దారుణాలకు అమెరికా ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు ప్రశ్నించాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.
