విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు.. NEET వివాదంపై ఇర్ఫాన్, మంజ్రేకర్ ఫైర్ 

విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు.. NEET వివాదంపై ఇర్ఫాన్, మంజ్రేకర్ ఫైర్ 

NEET Protest: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై విద్యార్థులు చేస్తున్న పోరాటానికి భారత మాజీ క్రికెటర్లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విద్యా వ్యవస్థలో పేపర్ లీకేజీలు జరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, దేశ భవిష్యత్తు అయిన యువత కలలను కాపాడాలని దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఇర్ఫాన్ పఠాన్, సంజయ్ మంజ్రేకర్లు సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.  

పేపర్ లీక్‌లు విద్యార్థుల భవిష్యత్తుకి పెద్ద దెబ్బ: ఇర్ఫాన్ పఠాన్
మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. నిరసన తెలుపుతున్న విద్యార్థులకు తన సానుభూతిని, మద్దతును తెలియజేశారు. ప్రతి విద్యార్థి తమ మెరుగైన భవిష్యత్తు కోసం ఏళ్ల తరబడి కష్టపడతారని, వారి ప్రయాణంలో కుటుంబాల త్యాగాలు కూడా ఎంతో ఉంటాయని ఆయన గుర్తు చేశారు. ఎలాంటి పేపర్ లీక్‌లు కూడా విద్యార్థుల ఆశలను, నమ్మకాన్ని దెబ్బతీయకూడదని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశం, ప్రభుత్వ వ్యవస్థలు విద్యార్థులందరికీ సమానమైన అవకాశాలు కల్పించాలని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు ఇర్ఫాన్ విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులని అణచివేయకండి: సంజయ్ మంజ్రేకర్
మాజీ భారత ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ కూడా పోరాడుతున్న విద్యార్థుల గొంతుకకు తన మద్దతును తెలియజేశాడు. నేను ఇండియన్ యువతకు అండగా నిలబడుతున్నాను.. వారిని అణచివేయడానికి ప్రయత్నించకండి, వారిని స్వేచ్ఛగా వదిలి పెట్టండి.. వారు ఈ భారతదేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పారదర్శకమైన పరీక్షా విధానం కోసం, బాధ్యులపై చర్యల కోసం దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు చేస్తున్న పోరాటం కొనసాగుతున్న తరుణంలో మంజ్రేకర్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. పోటీ పరీక్షల వ్యవస్థపై విద్యార్థుల్లో మళ్లీ నమ్మకాన్ని కల్పించేందుకు సమూల మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.  

ఓటమి ఓకే.. కానీ మోసం చేయడం తప్పు: సచిన్ టెండూల్కర్
ఈ వివాదంపై క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ.. తన తండ్రి నేర్పిన అమూల్యమైన జీవిత పాఠాన్ని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి ఒక ప్రొఫెసర్‌గా ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచారు, ఓడిపోవడం తప్పుకాదు కానీ మోసం చేయడం (చీటింగ్) చాలా తప్పు, ఎప్పుడూ షార్ట్‌కట్‌లను సెలక్ట్ చేసుకోకూడదని తన చిన్నతనంలోనే నేర్పించారని వెల్లడించాడు. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కనప్పుడు వారు తీవ్ర నిరాశకు గురికావడం సహజమేనని సచిన్ అన్నారు. 

ALSO READ : ఏం గుండె తల్లీ నీది.. లాఠీఛార్జీకి భయపడకుండా.. 40 నిమిషాలు పోలీసులతో పోరాటం.. 

ప్రతిభకు ప్రాధాన్యతనిచ్చే సమాజాన్ని నిర్మించాలి: 
కేవలం ఫలితాల కంటే కష్టపడే తత్వానికి, నిజాయితీకి, ప్రతిభకు ప్రాధాన్యతనిచ్చే సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలలు, అధికారులపై ఉందని మాస్టర్ బ్లస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. మన యువతలోని కలలే దేశ ప్రగతికి చోదకశక్తి అని, అందరం కలిసికట్టుగా శ్రమించి విద్యార్థుల భవిష్యత్తును సురక్షితం చేసే సరైన పరిష్కారాలను కనుగొంటామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ జై హింద్ అని సచిన్ ముగించారు.