యూఎస్ ఆర్మీ బేస్పై ఇరాన్ దాడి.. ప్రతీకారంగానే చేశామన్న ఐఆర్జీసీ

యూఎస్ ఆర్మీ బేస్పై ఇరాన్ దాడి.. ప్రతీకారంగానే చేశామన్న ఐఆర్జీసీ
  • మళ్లీ దాడి చేస్తే భారీ ఎత్తున ప్రతిదాడి తప్పదని వార్నింగ్
  • టెహ్రాన్ దాడిని తిప్పికొట్టిన అమెరికా బలగాలు
  • నాలుగు డ్రోన్లను కూల్చివేశామని వెల్లడి
  • ఇరాన్ డ్రోన్ సెంటర్​పై అమెరికా అటాక్

టెహ్రాన్, వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఓవైపు శాంతి చర్చలు జరుపుతూనే అమెరికా తమ భూభాగంపై దాడులకు పాల్పడుతోందని ఇరాన్ మండిపడింది. బుధవారం రాత్రి బందాస్ అబ్బాస్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని తమ సైనిక స్థావరంపై అమెరికా బలగాలు మిసైల్ దాడులు చేశాయని తెలిపింది.

ఈ దాడులకు ప్రతీకారంగా తాము కూడా అమెరికా సైనిక స్థావరంపై మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్(ఐఆర్​జీసీ) గురువారం వెల్లడించింది. తెల్లవారుజామున 4:50 గంటల ప్రాంతంలో ఈ దాడులు చేసినట్లు తెలిపింది.

అమెరికా మరోసారి దాడులకు ప్రయత్నిస్తే తాము ఉపేక్షించబోమని, రెట్టింపు స్థాయిలో విరుచుకుపడతామని ఐఆర్​జీసీ తేల్చిచెప్పింది. అయితే తాము దాడులు జరిపిన అమెరికా సైనిక స్థావరానికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. అమెరికా సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. ఐఆర్ జీసీ దాడులు జరిపింది కువైట్ లోని యూఎస్ మిలటరీ బేస్ పైనేనని తెలుస్తోంది.

ఇరాన్ మిసైళ్లు, డ్రోన్లు తమ స్థావరంపైకి దూసుకురావడం గుర్తించి వాటిని మధ్యలోనే కూల్చేశామని అమెరికా ప్రకటించింది. హార్మూజ్ జలసంధి సమీపంలో నాలుగు డ్రోన్లను కూల్చేశామని, బందాస్ అబ్బాస్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని డ్రోన్ కంట్రోల్ సైట్​పై మిసైల్ దాడి చేశామని అమెరికా మిలటరీ వర్గాలు వెల్లడించాయి.

రక్షణాత్మక దాడులే..:అమెరికా
బుధవారం బందాస్ అబ్బాస్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని ఇరాన్ స్థావరంపై అమెరికా దాడులు చేసింది. ఈ సైనిక స్థావరం హార్మూజ్ జలసంధికి అత్యంత సమీపంలో ఉండడం, జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు ముప్పుగా మారుతుందనే ఉద్దేశంతోనే ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా పేర్కొంది. 

కేవలం రక్షణాత్మక కారణాలవల్లే ఈ దాడులు చేసినట్లు అమెరికా మిలటరీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఏప్రిల్​లో అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం సాఫీగా కొనసాగాలన్నదే తమ దాడి వెనక ఉన్న ఉద్దేశమని వివరించారు.

అయితే, కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా పదే పదే ఉల్లంఘిస్తోందని టెహ్రాన్ ఆరోపిస్తోంది. అదేసమయంలో తమ అనుమతి లేకుండా హార్మూజ్ జలసంధి దాటేందుకు ప్రయత్నించే నౌకలను హెచ్చరిస్తూ కాల్పులు (వార్నింగ్ షాట్స్) జరిపామని ఐఆర్ జీసీ తెలిపింది.

అమెరికాకు సంబంధించిన ఓ ఆయిల్ ట్యాంకర్ తో పాటు మరో నాలుగు నౌకలను హెచ్చరించి వెనక్కి మళ్లించినట్లు వివరించింది. మరోవైపు, హార్మూజ్ జలసంధిలో డెడ్ లాక్ కొనసాగుతోందని అమెరికా వర్గాలు చెబుతుండగా.. గడిచిన 24 గంటల్లో జలసంధి గుండా 23 నౌకలు సాఫీగా ప్రయాణించాయని ఇరాన్ మీడియా పేర్కొంది.