కడుపులో116 ఇనుప మేకులు, వైర్లు

కడుపులో116 ఇనుప మేకులు, వైర్లు

రాజస్థాన్ : కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి ట్రీట్ మెంట్ కోసం సర్కార్ హస్పిటల్ కు వెళ్లాడు. అయితే స్కానింగ్ చేసిన డాక్టర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారట. కడుపులో ఉన్నది ఏ గడ్డలో..రాళ్లో కాదు..ఇనుప మేకులు. 116 మేకులు ఆ మనిషి పొట్టలోకి ఎలా వెళ్లాయో అర్థం కావడంలేదని అయోమయం అయ్యారు డాక్టర్లు.

రాజస్థాన్‌లోని బుండి ప్రాంతానికి చెందిన భోలా శంకర్(42) అనే వ్యక్తి కొద్ది రోజులుగా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవల కుటుంబ సభ్యులు అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. భోళా శంకర్‌ను పరీక్షించిన డాక్టర్ అనిల్ సైని.. అతనికి ఎక్స్‌రే తీయించారు. ఎక్స్‌రే కాపీలో పొట్టలో ఏవో మేకుల ఆకారంలో ఉన్నట్టు గమనించి ఆశ్చర్యపోయారు. నొప్పి తగ్గడానికి మందులు వేసి సోమవారం సీటీ స్కాన్ తీయించారు. దీంతో పొట్టలో మేకులు, మరికొన్ని వస్తువులు ఉన్నట్టు డాక్టర్లకు క్లారిటీ వచ్చింది. మంగళవారం శంకర్‌కు సర్జరీ చేసిన డాక్టర్లు .. అతని పొట్టలో నుంచి 116 మేకులు, పొడవాటి వైరు, ఇనుప గోలీని బయటికి తీశారు.

శంకర్ పొట్టలో నుంచి బయటికి తీసిన చాలా మేకులు 6.5 సెంటీమీటర్ల పొడవు ఉన్నాయని డాక్టర్ సైని చెప్పారు. సర్జరీ చేసి వస్తువులన్నీ బయటకు తీయడానికి గంటన్నర సమయం పట్టిందన్నారు. ప్రస్తుతం పేషంట్ పరిస్థితి నిలకడగా ఉందని, సర్జరీ తర్వాత అతడు సాధారణంగానే అందరితో మాట్లాడుతున్నాడని తెలిపారు డాక్టర్లు.