స్మశానాల్లో నిధుల గోల్ మాల్.. ఎంక్వైరీ లెటర్  మాయం

స్మశానాల్లో నిధుల గోల్ మాల్.. ఎంక్వైరీ లెటర్  మాయం
  • స్కామ్ నుంచి తప్పించుకునేందుకు అధికారులు యత్నం
  • 200 రోజులుగా ఎంక్వైరీ ఆఫీసర్‌‌ను నియమించలె

కరీంనగర్, వెలుగు: ‘స్మశానాల్లో గడ్డి పీకి 12 లక్షలు లేపిండ్రు’ శీర్షికతో వెలుగు దిన పత్రికలో ఈ ఏడాది జనవరి 12 న స్టోరీ  పబ్లిష్ అయింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.  దీనిపై అప్పటి మున్సిపల్ కమిషనర్ క్రాంతి స్పందించి షోకాజ్ నోటీసు జారీ చేయగా, ఆఫీసర్లు సరైన  వివరాలు అందించ లేదు. దీంతో ఆమె చార్జీ మెమో జారీ చేశారు. అయినా అధికారుల్లో చలనం లేకపోవడంతో కలెక్టర్ కు విచారణ అధికారిని నియమించాల్సిందిగా లెటర్ రాసింది. అయితే ఈ లెటర్ నెంబర్.. గతంలో పట్టణ ప్రగతిలో జరిగిన స్కామ్ లో విచారణ అధికారిని నియమించాలని ఎస్ఈకి రాసిన లేఖల నంబర్లు ఒకటే కావడం విశేషం. ఈ లెటర్  పంపించి 200 రోజులు దాటినా..  నేటి వరకు అధికారిని నియమించలేదు. కమిషనర్ రాసిన లెటర్ కలెక్టరేట్ లో మిస్ కావడం మరో అంతుచిక్కని విషయం.

విచారణకు ఎన్ని రోజులు.. ?

కరీంనగర్ కు చెందిన ముస్లిం గ్రేవ్​యార్డ్ ల్లో రంజాన్ పండగలకు క్లీన్ చేయడానికి రూ.12 లక్షలు వినియోగించామని ఆఫీసర్లు చెప్పారు. కానీ కాపువాడ గ్రేవ్​యార్డులో ముస్లిం  యువకులు, మిగిలిన కొన్ని చోట్ల మున్సిపల్ సిబ్బంది క్లీన్ చేశారు. కమిషనర్ ఎస్ఈ కృష్ణారావు అందించిన నోట్ ఫైల్ ఆధారంగా సంబంధిత అధికారులకు జనవరి 12న షోకాజ్  నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆమె ఆదేశించారు. అయినా అధికారులు నిర్ధిష్టమైన వివరాలు అందించలేదు. దీంతో మార్చి 25న ఈ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేయడానికి ఒక  అధికారిని నియమించాల్సిందిగా కోరుతూ జిల్లా కలెక్టర్ కు ఆమె లేఖ (సీ1/5174/2021) రాశారు. ఈ లెటర్ ను కలెక్టరేట్ సి సెక్షన్ వారు నెల రోజులు దాటిన తరవాత అంటే ఏప్రిల్ 26న తీసుకున్నారు. కానీ ఈ లెటర్ కలెక్టరేట్ లో ముట్టిందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 200 రోజులు పూర్తయినా ఇయ్యాల్టి వరకు -ఆఫీస్, మ్యాన్ వల్ గా కానీ ఫైల్ సర్క్యులేట్ కాలేదు. విచారణ అధికారిని నియమించలేదు. 

ఒకే నంబర్ పై రెండు లెటర్లు

కనీసం వారం, పది రోజులు చూసి వెంటనే రిమైండర్ లెటర్లు పెట్టి దాన్ని ఫాలోఅప్ చేయాల్సింది పోయి 200 రోజులు అయినా ఎటువంటి పట్టింపు లేకపోవడం విశేషం.  మున్సిపల్ లో ఉన్న అధికారులే ఈ ఫైల్ ను కలెక్టర్ కు చేరకుండా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తుంది. లెటర్ కలెక్టర్ కు చేరితే చర్యలు తప్పవని తెలుసుకున్న అధికారులు నానా తంటాలు పడ్డారు. ఇదే కాకుండా పట్టణ ప్రగతిలోనూ పెద్ద ఎత్తున నిధుల గోల్ మాల్  జరిగింది. దీనిపై విచారణ అధికారిని నియమించి అప్పటి కమిషనర్ ఎంక్వైరీ చేయించారు. ఈ విషయంలో విచారణ అధికారిగా పబ్లిక్ హెల్త్ ఈఈని  నియమిస్తూ ( సీ1/5174/2020) లేఖ రాశారు. అయితే స్మశానాల్లో నిధుల గోల్ మాల్ కు సంబంధించి విచారణ అధికారిగా ఒకరిని నియమించాలని కలెక్టర్ కు రాసిన లెటర్ నెంబర్ కూడా ఇదే కావడం విశేషం. అయితే ఇటీవల ఆర్టీఐ ద్వారా కోరిన సమాచారంతో అసలు విషయం బయట పడింది. ఇలా ఒకే లెటర్ ను రెండింటికీ వేసి మున్సిపల్ ఆఫీసర్లు ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించారు. కలెక్టరేట్ లోనూ ఫైల్ మూవ్ కాకుండా కుట్రలు పన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విచారణ అధికారిని నియమించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.