
అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్ నాయుడు గురువారం రూ.11 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. అలంపూర్ కు చెందిన ఓ కాంట్రాక్టర్ చేసిన పనికి సంబంధించిన ఎంబీ రికార్డ్ చేయడానికి డీఈ రూ.12వేలు డిమాండ్ చేశాడు.
చివరకు రూ.11 వేలు లంచం ఇచ్చేందుకు బాధితుడు అంగీకరించి, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు అలంపూర్ పట్టణంలోని ఇరిగేషన్ ఆఫీస్లో డీఈ శ్రీకాంత్ నాయుడుకు డబ్బులు ఇవ్వగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డీఈని నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ సయ్యద్ ఖాదర్ జిలాని, సిబ్బంది పాల్గొన్నారు.