మేడిగడ్డకు రిపేర్లు కష్టమే..! ఆందోళనకరంగా మూడు బ్లాకులు..!

మేడిగడ్డకు రిపేర్లు కష్టమే..! ఆందోళనకరంగా మూడు బ్లాకులు..!
  • ఏడో బ్లాక్​ను పూర్తిగా కూల్చడం క్లిష్టమైన పని..  కూల్చేస్తే ఇతర బ్లాకులపై ప్రభావం పడే ప్రమాదం
  • అలాగే ఉంచి రిపేర్లు చేయడమూ కష్టమే
  • ఫౌండేషన్​లో 5 మీటర్ల వరకు నీళ్లే ఉన్నాయన్న అనుమానాలు
  • మరికొన్ని బ్లాకుల్లోనూ లోపాలు ఉండొచ్చన్న సందేహాలు
  • అన్ని బ్లాకుల్లోనూ క్షుణ్ణంగా పరీక్షలు జరిపాకే ముందుకెళ్లాలన్న యోచన
  • మేడిగడ్డ సహా మూడు బ్యారేజీల రిపేర్లపై ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ లేఖ

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు చేయడం కష్టమేనా? ఒకవేళ చేసినా ఎక్కువ టైమ్ పడుతుందా? బ్యారేజీలోని ఇతర బ్లాకుల్లోనూ లోపాలున్నాయా? అంటే అవునన్న సమాధానాలే వస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు చేయడమే ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులకు అతిపెద్ద సవాల్​గా మారింది. ఏం ముట్టుకుంటే ఏమవుతుందోనన్న ఆందోళన అధికారులను వెంటాడుతున్నది. బ్యారేజీలోని ఏడో బ్లాక్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే విజిలెన్స్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ), కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్​లు రిపోర్టులను సమర్పించాయి. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఏడో బ్లాక్​ను పూర్తిగా కూల్చేసి కట్టడమే నయమని తేల్చి చెప్పింది. 

రిపేర్లు చేసుకోవచ్చుగానీ.. అత్యంత పకడ్బందీగా చేయాలని, కొంచెం తేడా వచ్చినా నష్టం తప్పదని హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దానికి రిపేర్లు చేయడం అతికష్టమని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఏడో బ్లాక్​ను పూర్తిగా కూల్చేసి కట్టడం అత్యంత క్లిష్టమైనపని అంటున్నారు. ఆ బ్లాక్​ను కూల్చాలని ప్రయత్నిస్తే ఇతర బ్లాకులపైనా ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరే కూల్చకుండా రిపేర్లు చేద్దామన్నా ఎలా చేయాలన్న దానిపై తర్జనభర్జనలు పడుతున్నట్టు తెలిసింది. ఒకవేళ రిపేర్లు చేయాల్సి వస్తే అది రెండు మూడు నెలల్లో అయ్యేది కాదని తేల్చి చెబుతున్నారు. రిపేర్లకు కనీసం రెండేండ్లైనా పడుతుందని అంటున్నారు. దీంతో కూల్చి కొత్తది కట్టడమా.. కుంగిన దానికి రిపేర్లు చేయడమా అన్న విషయంలో డిపార్ట్​మెంట్ డైలమాలో పడినట్టు తెలుస్తున్నది. ఎక్స్​పర్ట్స్​తో అన్ని తేల్చాకే ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్టు సమాచారం.

మరికొన్ని బ్లాకుల్లోనూ లోపాలు..

బ్యారేజీలోని ఏడో బ్లాక్ ఒక్కటే కాదు.. ఇతర బ్లాకుల్లోనూ లోపాలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిహాబిలిటేషన్ డిజైన్ల కోసం అక్కడ టెస్టులు చేసేందుకు ఇటీవల పుణేలోని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణులు అక్కడ ప్రాథమిక పరిశీలన చేసి వెళ్లారు. అయితే, అక్కడి పరిస్థితుల ప్రకారం చూస్తుంటే ఏడో బ్లాక్​లోనే కాకుండా మరికొన్ని బ్లాకుల్లోనూ సమస్యలున్నట్టుగా అంచనా వేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అన్ని బ్లాకులపైనా సమగ్రంగా స్టడీ చేయించాలని ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్ణయించారని సమాచారం. మేడిగడ్డనే కాకుండా.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ ప్రతి బ్లాకు వద్దా జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్​ను చేయించాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.

ప్రభుత్వానికి లేఖ..

మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో ఏం చేయాలి.. ఎలా ముందుకు పోవాలన్నదానిపై ప్రభుత్వానికి ఇరిగేషన్​ శాఖ లేఖ రాసినట్టు తెలుస్తున్నది. బ్యారేజీలకు రిహాబిలిటేషన్ డిజైన్లకు సంబంధించి డిపార్ట్​మెంట్​కు చెందిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషనే బాధ్యత వహించాలని ఇటీవలి మీటింగ్​లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీడీవో నేతృత్వంలోనే డిజైన్లు చేయించాలని భావిస్తున్న ఇరిగేషన్ శాఖ.. దేశంలోని ప్రముఖ సంస్థల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్​ను స్వీకరించాలని నిర్ణయించింది. ఆయా సంస్థల నుంచే బ్యారేజీలకు ఓ డిజైనర్ కన్సల్టెంట్​ను నియమించాలని భావిస్తున్నది. దాంతో పాటు బ్యారేజీల రిపేర్లు, టెస్టులు తదితర అంశాలతో ప్రభుత్వానికి సవివరంగా ఇరిగేషన్​ శాఖ లేఖ రాసిందని సమాచారం.

ఆందోళనకరంగా మూడు బ్లాకులు..!

బ్యారేజీ ఫౌండేషన్ అయిన సీకెంట్ పైల్స్ వ్యవస్థలో ఇసుకతో నింపిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫౌండేషన్​ వ్యవస్థలోని ఇసుక కింద ఐదు మీటర్ల వరకు నీళ్లున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మరికొన్ని బ్లాకుల్లోనూ సీపేజీ ఏమైనా ఉండి ఉంటుందా అని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఓ మూడు బ్లాకుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా చెబుతున్నారు. 

వాటి పరిస్థితి తేలాంటే ఇప్పుడు అక్కడ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్​ను చేయాల్సి ఉంటుందని, కానీ అక్కడ బోర్​హోల్స్ వేసే పరిస్థితులు కూడా లేవని చెబుతున్నారు. ప్రస్తుతం వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదిలేస్తున్నా.. ఫౌండేషన్​లో మాత్రం నీటి ఆనవాళ్లున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. సీడబ్ల్యూపీఆర్ఎస్ వాళ్లు అక్కడ టెస్టులు చేయాలన్నా ఆ నీళ్లు పూర్తిగా పోవాల్సిందేనని, దానికి డిసెంబర్ దాకా టైమ్​పట్టే అవకాశం ఉందని అంటున్నారు.