ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్‌‌‌‌ను తొలగించాల్సిందే

ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్‌‌‌‌ను తొలగించాల్సిందే

హైదరాబాద్, వెలుగు:  ఇరిగేషన్ ఈఎన్సీ (జనరల్) మురళీధర్‌‌‌‌ను తొలగించాల్సిందేనని పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, రిటైర్డ్ ఈఎన్సీలు డిమాండ్ చేస్తున్నారు. ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో 11 ఏండ్లకు పైగా ఎక్స్‌‌టెన్షన్‌‌పై కొనసాగుతున్న మురళీధర్‌‌‌‌ను తొలగించి, విచారిస్తే తప్ప అక్రమాలు బయటికి రావని స్పష్టం చేస్తున్నారు. మురళీధర్‌‌‌‌ను పదవి నుంచి తొలగించాలని ఇప్పటికే పలుమార్లు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని లేవనెత్తారు. ఇటీవల తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తదితరులు మాట్లాడుతూ.. మురళీధర్ కొనసాగింపు సరికాదని విమర్శించారు. 

అక్రమాలకు బాధ్యుడైన వ్యక్తితోనే ప్రభుత్వం మేడిగడ్డ దగ్గర ఎలా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇప్పిస్తుందని ప్రశ్నించారు. వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని, అక్రమాలను నిగ్గు తేల్చేందుకు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ సోమవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌లో కొనసాగుతున్న అందరినీ తొలగించాలని వినతిపత్రం ఇచ్చారు.

2013లోనే రిటైర్ అయినా..

2013లో ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) గా మురళీధర్ రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌పై కొనసాగుతున్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైనింగ్ సహా అనేక ప్రాజెక్టుల రూపకల్పనలో క్రియాశీలంగా పని చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈఎన్సీగా కొనసాగుతారంటూ రెండున్నర ఏళ్ల క్రితం జీవో ఇచ్చారు. ఈ క్రమంలో ఇరిగేషన్ డిపార్ట్‌‌‌‌మెంట్ రీ ఆర్గనైజేషన్ తర్వాత మురళీధర్ ఇంకా పవర్ ఫుల్ అయ్యారు. 

ఆయనకు అధికారాలు పెంచేందుకే కేసీఆర్ ఈ డిపార్ట్‌‌‌‌మెంట్ ను రీ ఆర్గనైజేషన్ చేయించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అంతకుముందు ఈఎన్సీ (అడ్మిన్) హెడ్ గా ఉన్న కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ) పోస్టు కూడా ఈఎన్సీ (జనరల్)కే కట్టబెట్టారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్‌‌‌‌మెంట్ల టెండర్ల ప్రక్రియకు మురళీధర్ ను చీఫ్ గా నియమించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో.. వెంటనే మురళీధర్ ను ఈఎన్సీ పోస్ట్ నుంచి తొలగించాలనే డిమాండ్లు తీవ్రమవుతున్నాయి.