చెరువులు, కాల్వల నిర్వహణకు.. సాగునీటి సంఘాలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

చెరువులు, కాల్వల నిర్వహణకు.. సాగునీటి సంఘాలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • స్థానిక ఎన్నికల తర్వాత ఏర్పాటు చేస్తం: మంత్రి ఉత్తమ్​
  • తొలుత చెరువులకు.. 
  • ఆ తర్వాత క్రమంగా పెద్ద ప్రాజెక్టులకూ విస్తరణ
  • తుమ్మిడిహెట్టి రివైజ్డ్ డీపీఆర్​ను త్వరగా సిద్ధం చేయండి
  • అధికారులతో సెక్రటేరియెట్​లో మంత్రి రివ్యూ

హైదరాబాద్, వెలుగు: చెరువులు, కాల్వలను మెరుగ్గా నిర్వహించేందుకు, వాటి సంరక్షణకు సాగునీటి సంఘాలను ఏర్పాటు చేస్తామని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం సాగునీటి సంఘాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తొలుత చెరువుల పరిరక్షణకు ఈ సంఘాలను నియమిస్తామని, ఆ తర్వాత దశలవారీగా పెద్ద ప్రాజెక్టులకూ వాటిని విస్తరిస్తామని పేర్కొన్నారు. సాగునీటి సంఘాలకు కన్వీనర్​గా ఇరిగేషన్​ శాఖ నుంచి ఓ అధికారిని నియమిస్తామన్నారు.

 ప్రతి సాగునీటి సంఘానికి సంబంధించిన బాధ్యతలను లష్కర్లకు అప్పగిస్తామన్నారు. సోమవారం ఆయన ఇరిగేషన్ శాఖ అధికారులతో సెక్రటేరియెట్​లో రివ్యూ చేశారు. ఇటీవలి వర్షాలకు చాలా వరకు చెరువులు, కాల్వలకు గండ్లు పడ్డాయని, మెరుగైన నిర్వహణ లేకపోవడం వల్లే నష్టం జరిగిందని పేర్కొన్నారు. సాగునీటి సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా ఇలాంటి లోపాలను అధిగమించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. తెలంగాణ అగ్రికల్చర్, ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులతో చర్చించి సాగునీటి సంఘాలను ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారు. 

చెరువుల నిర్వహణ లేకపోవడం వల్ల పదేపదే గండ్లు పడి రైతులకు నష్టం వాటిల్లుతున్నదని మంత్రికి కమిషన్ ఇటీవల ఫిర్యాదు చేసింది. ఈ నష్టాన్ని భర్తీ చేయాలంటే స్థానిక రైతులను ఇందులో భాగస్వామ్యం చేస్తే బాగుంటుందని సిఫార్సు చేసింది. 

ఆల్మట్టి ఎత్తుపై సుప్రీంలో కేసు వేయండి

ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచాలన్న కర్నాటక ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టులో బలంగా పోరాడాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలిచ్చారు. ఆల్మట్టి ఎత్తు పెంచకుండా సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలన్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు రివైజ్డ్​ డీపీఆర్​ను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని ఆదేశించారు. కేబినెట్ క్లియరెన్స్ తర్వాత ఎస్ఎల్​బీసీ పనులను తిరిగి ప్రారంభిస్తామన్నారు. అంతేగాకుండా కేబినెట్ ఆమోదం కోసం కల్వకుర్తి, దేవాదుల ప్యాకేజ్ 6 రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ను త్వరగా సిద్ధం చేయాలని సూచించారు. ఖమ్మం ఇరిగేషన్ భూములు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఫైల్స్​నూ వేగంగా సబ్​మిట్ చేయాలన్నారు.

ప్రాజెక్టులపై కేటీఆర్​వి పిచ్చి మాటలు

ప్రాజెక్టులపై కేటీఆర్​ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఉత్తమ్ అన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపు విషయంలో రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సెక్రటేరియెట్​లో రివ్యూ అనంతరం మంత్రి మీడియాతో చిట్​చాట్ చేశారు. ‘‘ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని సుప్రీంకోర్ట్ స్టే ఉంది. ఆల్మట్టి ఎత్తు పెంచకుండా అడ్డకుంటం. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తం. సుప్రీంకోర్టులో వాదనల కోసం సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ను నియమించాం. కృష్ణా, గోదావరి నీటి వాటాలపై పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు అన్యాయమే జరిగింది. కాంగ్రెస్ హయంలోనే న్యాయం జరిగింది’’ అని పేర్కొన్నారు.

వడ్ల సేకరణ పరిమితి పెంచండి

  •     80 లక్షల టన్నులు సేకరించాలనుకుటున్నం: ఉత్తమ్​
  •     కేంద్రాన్ని కోరేందుకు నేడు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి 

ధాన్యం సేకరణ పరిమితి పెంచాలని సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని కోరనున్నారు. ఉత్తమ్ మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి రాష్ట్రంలో ధాన్యం సేకరణ, రవాణా సంబంధిత సమస్యలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సెక్రటెరియట్​లో మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలో 80 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

 అయితే కేంద్ర ప్రభుత్వం 52 లక్షల టన్నుల సేకరణకు మాత్రమే అనుమతి ఇచ్చిందని తెలిపారు. మిగిలిన ధాన్యం ప్రొక్యూర్​మెంట్​కు అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని గోదాములు, రైస్ మిల్లులు ఇప్పటికే ధాన్యంతో నిండిపోయి ఉన్నాయని, ఈ ధాన్యాన్ని తరలించడానికి 300 రైళ్లను కేటాయించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు వెల్లడించారు. ఈ సమస్యలపై కేంద్ర మంత్రితో చర్చించి, రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం తగిన పరిష్కారాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.