పప్పు ధాన్యాల ఉత్పత్తి  మనదేశానికి సాధ్యమయ్యేనా?

పప్పు ధాన్యాల ఉత్పత్తి  మనదేశానికి సాధ్యమయ్యేనా?

ప్రపంచవ్యాప్తంగా మానవ పోషణకు చౌకగా దొరికే  ప్రోటీన్లకు  పప్పు ధాన్యాలు మూలాధారం.  సాగు వ్యర్థాలు పశు పోషణకు ఎంతో మేలు చేస్తాయి.  నేల ఆరోగ్యం,  మానవ  పోషకాహార భద్రత  మొదలైనవి  పటిష్టపరచాలంటే  అది అపరాల సాగుతోనే  ప్రారంభం అవుతుందని..  ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా ఫిబ్రవరి 10 తేదీన  ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం -2026ను నిర్వహిస్తున్నారు.

   ‘సాధారణ  స్థాయి నుంచి  శ్రేష్టమైన స్థాయి వరకు పప్పుధాన్యాలు’ అనే ముఖ్య ఉద్దేశంతో  అవగాహన  సదస్సులు,   రైతు సదస్సులు,  చైతన్య ర్యాలీలు  చేపట్టనున్నారు.   వచ్చే  సీజన్ నుంచి పెద్ద ఎత్తున అపరాల సాగుతో  నేల ఆరోగ్యంతోపాటు మన ఆహారంలో  భాగంగా  పప్పు ధాన్యాలను  విరివిగా తిని  మన ఆరోగ్యాన్ని  పటిష్టపరుచుకోవాలని ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్  ప్రపంచ దేశాలను కోరుతోంది.

పత్తి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, సోయాబీన్,  ఇతర నూనె గింజలలో అపరాల సాగు  అంతర పంటగా చేపట్టడం వలన జీవవైవిధ్యం పెరుగుతుంది.  ఇతర ప్రోటీన్ల ఉత్పత్తికి అయ్యే నీటి వినియోగంతో పోలిస్తే అపరాల ప్రోటీన్ల ఉత్పత్తికి కేవలం 10 శాతం మాత్రమే నీటిని వినియోగించుకుంటాయి.  మట్టి కార్బన్  సీక్వెస్ట్రేషన్ తోపాటు పర్యావరణానికి హాని కలిగించే గ్రీన్ హౌస్ వాయువు  ఉద్గారాల ప్రభావం  పప్పు ధాన్యాల సాగుతో  తగ్గే  అవకాశం ఉంది. 

73 లక్షల టన్నుల పప్పు ధాన్యాల దిగుమతి

  2024-–25వ  సంవత్సరంలో 5.5 బిలియన్ డాలర్ల విలువ చేసే సుమారు 73 లక్షల టన్నుల పప్పు ధాన్యాలను మన దేశం దిగుమతి చేసుకున్నది.  ఇది అంతకుముందు  సంవత్సరంతో పోలిస్తే ఏడు శాతం అధికం.   పంట మార్పిడి  లేకపోవడం, పప్పు ధాన్యాల కోసం ఇతర  దేశాల వైపు  చూడడం,  ఎక్కువగా  ఎరువులు  వాడడం వలన  నేలలు సారవంతాన్ని  కోల్పోతున్నాయి.

  దేశంలో  పప్పు ధాన్యాల సాగు క్షీణత  రైతుల వైఫల్యం కాదు  ఇది విధానాల లోపాలుగా  మన దేశ ఆర్థిక సర్వే 2025–-26 పేర్కొన్నది.  మన దేశంలో 2023-–24 లో సుమారు 27.5 మిలియన్ హెక్టార్లలో  వివిధ రకాల పప్పుధాన్యాల పంటలను  సాగు చేశాం.  తద్వారా  సుమారు 24.25 మిలియన్  మెట్రిక్ టన్నుల  పప్పు ధాన్యాల ఉత్పత్తి  జరిగినది.  

పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి  సాధించడానికి  ఉత్పత్తి  వ్యత్యాసమైన  ఏడు మిలియన్  మెట్రిక్  టన్నుల ఉత్పత్తి వచ్చే ఐదు సంవత్సరాలలో  పెంచాలని  కేంద్ర  ప్రభుత్వం ఇటీవల  ఆత్మనిర్బరత పప్పు ధాన్యాల మిషన్  కార్యక్రమాన్ని ప్రారంభించింది. 

తెలంగాణలో పప్పు ధాన్యాల సాగు

2023-–24  సంవత్సరంలో  తెలంగాణలో సుమారు 8.27 లక్షల ఎకరాలలో వివిధ రకాల పప్పు ధాన్యాలను  సాగు చేయడం జరిగింది.  తద్వారా సుమారు 3.40 లక్షల టన్నుల వివిధ  పప్పు ధాన్యాల ఉత్పత్తి చేయడం జరిగింది.  సంవత్సరానికి  తెలంగాణ  మొత్తం జనాభాకు కావలసిన పప్పుధాన్యాలు సుమారు 13.0 లక్షల టన్నులు.  మన రాష్ట్ర పప్పు ధాన్యాల ఉత్పత్తి వాటా మన వినియోగంలో కేవలం 26.2 శాతమే.  మన రాష్ట్రం కూడా వివిధ  ప్రాంతాల నుంచి  పప్పులను దిగుమతి  చేసుకుంటుంది.  

గ్రామీణ  జనాభాకు కావలసిన  ముఖ్యమైన పోషకాలు  ప్రోటీన్లు, పీచు పదార్థం, ఖనిజ లవణాలు,  విటమిన్లు  అందించడంలో  పప్పుధాన్యాలు  ఎంతో  దోహదపడతాయి. రాష్ట్రంలో  వివిధ అపరాల తలసరి  లభ్యత  సంవత్సరానికి  సుమారు 7.06 కిలోలు.  

తెలంగాణ రాష్ట్ర  ప్రస్తుత తలసరి  అవసరం సంవత్సరానికి సుమారు 18.3 కిలోలు.   మరోవైపు భారత  వైద్య పరిశోధనా మండలి  సూచించిన  తలసరి  పప్పు వినియోగం  సంవత్సరానికి సుమారు 29.2 కిలోలు.  పెరుగుతున్న జనాభాకు  అనుగుణంగా  మన రాష్ట్రంలో  పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. 

అపరాల ఉత్పత్తిలో ఆదిలాబాద్​ ప్రథమస్థానం

ఉమ్మడి ఆదిలాబాద్ (25%) జిల్లా  అపరాల ఉత్పత్తిలో  మొదటి స్థానంలో ఉన్నది.  ఆ తరువాత స్థానంలో  ఉమ్మడి జిల్లాలైన మహబూబ్​నగర్ (16.1%),  మెదక్ (15.3%),  వరంగల్ (12%),  నల్గొండ(8%),  రంగారెడ్డి (6%)  జిల్లాలు ఉన్నాయి.  తాండూర్  కందిపప్పుకు  జీఐ  ట్యాగ్ ఉండడం వలన  జాతీయ,  అంతర్జాతీయ స్థాయిలో  మంచి గుర్తింపు ఉంది.  తద్వారా రైతులు మంచి లాభాలు పొందవచ్చు. 

 అపరాలు సాగు చేసే ప్రాంతాలలో  భారీ,   చిన్న మధ్య  తరహా పప్పు మిల్లులను  ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.   భవిష్యత్తులో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో  పప్పులతో తయారు చేసిన ప్రోటీన్ల ఆహార పదార్థాలు  ప్రముఖ పాత్ర వహించే అవకాశం ఉంది. ఈక్రమంలో అపరాల సాగు విస్తరణ, ఉత్పాదకత  పెరిగే అవకాశం ఉంటుంది. 

 పప్పు ధాన్యాల మిషన్

 రైతులను పప్పు ధాన్యాల సాగు వైపు ప్రోత్సహించడానికి ముఖ్యంగా పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.11,440 కోట్ల పెట్టుబడి ప్రోత్సాహం అందించనుంది.  ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న సుమారు  27.69  మిలియన్ మెట్రిక్ టన్నుల  పప్పుధాన్యాల నుంచి  వచ్చే  ఐదు సంవత్సరాల (2030-–2031) నాటికి 35.0  మిలియన్  మెట్రిక్ టన్నుల  పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యంగా ‘ఆత్మనిర్భరత  పప్పు ధాన్యాల  మిషన్’  పనిచేయబోతుంది.   దీనిలో భాగంగా  రైతులకు వివిధ రకాల నాణ్యమైన పప్పు ధాన్యాలు విత్తన కిట్స్  అందుబాటులోకి తెచ్చి 88 లక్షల పప్పు ధాన్య విత్తన కిట్స్ ఉచితంగా రైతులకు అందించడానికి ఈ మిషన్ పని చేయబోతుంది. 

పంటకోత తర్వాత నష్టాలను తగ్గించడానికి సుమారు 1,000 ప్రాసెసింగ్  పప్పుధాన్యాల  ప్రాసెసింగ్ యూనిట్లు  గ్రామీణ  ప్రాంతాలలో ఏర్పరచడానికి ప్రణాళిక  తయారుచేస్తుంది. అంతేకాకుండా రాబోయే నాలుగు సంవత్సరాలలో  రైతుల నుంచి 100% కందులు,  మినుములు,  ఎర్ర పప్పు  కొనుగోలు  చేయబోతుంది. 

 డాక్టర్. ఎ. పోశాద్రి, అసిస్టెంట్ ప్రొఫెసర్,
ప్రొ.  జయశంకర్  తెలంగాణ అగ్రికల్చర్​ యూనివర్సిటీ