యూపీ రాజకీయ మార్పులకు ప్రోగ్రెస్​ కార్డులే కారణమా?

యూపీ రాజకీయ మార్పులకు ప్రోగ్రెస్​ కార్డులే కారణమా?
  • బయటకొచ్చిన నేతలను చేర్చుకుంటున్న ఎస్పీ చీఫ్
  • పరిస్థితిని చక్కదిద్దేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం కృషి

న్యూఢిల్లీ, వెలుగు: ఉత్తరప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నిక‌‌లు.. ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్​గా మారాయి. నాలుగున్నరేండ్లు బీజేపీ సర్కారులో మంత్రులుగా, ఇతర పదవుల్లో ఉన్న లీడర్లు.. ఒక్కసారిగా పార్టీని వీడటం చర్చనీయాంశమైంది. లీడర్ల పనితీరును అంచనా వేస్తూ హైకమాండ్​ తయారు చేసిన ప్రోగ్రెస్​ కార్డులే ఆయా నేతల రాజీనామాలకు కారణమనే వాదన వినిపిస్తోంది. సీట్లు, టికెట్ల కేటాయింపులను నిర్ణయించేంది ఈ కార్డులేనని తెల్వడంతో పార్టీని వీడుతున్నారని అంటున్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చినోళ్లు వచ్చినట్లుగా సమాజ్​వాదీ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. యోగి ​ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. ఇది ముమ్మాటికి అవకాశవాద రాజకీయమేనని బీజేపీ లీడర్లతోపాటు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల వేళ ప్రభుత్వంపై బురద జల్లేందుకే వీళ్లంతా ప్రయత్నిస్తున్నారని బీజేపీ లీడర్లు మండిపడుతున్నారు. ఇట్లా బీజేపీని వీడిన లీడర్లతో అక్కడి ప్రతిప‌‌క్ష నేత, ఎస్పీ చీఫ్​ అఖిలేశ్​ యాద‌‌వ్  దోస్తీ కట్టడం విమర్శలకు మ‌‌రింత బ‌‌లం చేకూరుస్తున్నది.  

రెండేండ్ల ముందే కేబినెట్​ విస్తరణ..?
వాస్తవానికి రెండేండ్ల ముందు నుంచే యోగి సర్కార్ 2022 ఎన్నికలకు సిద్ధమైంది. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, ముఖ్యంగా క్యాస్ట్ బ్యాలెన్స్, వివిధ వర్గాలకు ప్రాధాన్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని గతేడాది సెప్టెంబర్​లో కేబినెట్​ను కూడా ఎక్స్ పాన్షన్  చేసింది. ఇదే సందర్భంలో అందరి ప్రోగ్రెస్ రికార్డులను తయారు చేసింది. ఈ లిస్ట్​లో  ప్రస్తుతం రిజైన్ చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయి. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం, ప్రజల్లో ఆదరణ కోల్పోవడం వంటి అంశాలను పార్టీ పరిగణనలోకి తీసుకుందని కొంత‌‌మంది కీలక నేతలు చెప్పారు. దీని ఆధారంగా 2022 సీట్ల కేటాయింపులో వారికి చెక్ పెట్టాలని పార్టీ యోచిస్తున్నదని, దీన్ని పసిగట్టిన నేతలు బీజేపీపై స్టేట్​లో నెగెటివ్ గ్రాఫ్ క్రియేట్ చేసే వ్యూహంతో రాజీనామాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అఖిలేశ్​తో చేతులు కలిపేందుకు వీరంతా బయటకు వెళ్తున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్​ బీజేపీలో చోటుచేసుకుంటన్న పరిణామాలపై పార్టీ హైకమాండ్ ఫోకస్​ పెట్టింది. నష్ట నివారణ చర్యలు చేపట్టింది.  

వాళ్లది సెల్ఫ్​ ఎజెండా: లక్ష్మణ్​
ఉత్తరప్రదేశ్​లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీని వీడుతున్నది సెల్ఫ్ అజెండాతోనేనని ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్  ఆరోపించారు. ఇలాంటి నేతలతో పార్టీకి నష్టం లేదని లక్ష్మణ్​ పేర్కొన్నారు. మోడీ, యోగి హయాంలో ఓబీసీలకు న్యాయం జరిగిందన్నారు.

ఆ నాడే రిజైన్​ చేసుంటే..!
బీజేపీని వీడిన నేత ధరమ్ సింగ్ మాట్లాడుతూ... ‘‘సర్కారులోని యాంటీ దళిత్, యాంటీ ఓబీసీ నిర్ణయాలపై 140 మంది ఎమ్మెల్యేలం గతంలో నిరసన తెలిపినం. ఆ రోజు నుంచే సమయంకోసం వేచి చూస్తున్నం’’ అన్నారు. ఆనాడే బహిరంగంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ వాళ్లంతా రిజైన్  చేసి ఉంటే ప్రభుత్వమే కుప్పకూలేది. అలా చేయకుండా ఎన్నికల వేళ పార్టీ మారడం రాజకీయ స్వార్థం కోసమేనని విశ్లేషకులు అంటున్నారు. వీళ్లే రేప్పొద్దున అఖిలేష్‌‌నూ దెబ్బకొట్టర‌‌న్న గ్యారెంటీ లేదు.