14 ఏళ్ల పిల్లోడికి ప్రభుత్వం భయపడిందా.. అరెస్ట్ తర్వాత ఎందుకింత ట్రెండ్ అయ్యాడు.. ఎవరీ అశ్వమిత్ గౌతమ్..?

14 ఏళ్ల పిల్లోడికి ప్రభుత్వం భయపడిందా..  అరెస్ట్ తర్వాత ఎందుకింత ట్రెండ్ అయ్యాడు.. ఎవరీ అశ్వమిత్ గౌతమ్..?

అశ్వమిత్ గౌతమ్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఇది. ఇండియాకు మరో ధృవ్ రాఠీ దొరికాడు. ప్రభుత్వాలను కడిగి పారేసేందుకు మరో యువ సంచలనం తయారవుతున్నాడు.. అతడో భగత్ సింగ్, మరో అంబేద్కర్.. అంటూ సోషల్ మీడియాలో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 14 ఏళ్ల బాలుడిని అరెస్టు చేసిన తర్వాత ఇతడు దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ టాపిక్ గా మారాడు. యోగి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన ఈ సోషల్ మీడియా సంచలనం లేటెస్టుగా విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. వీడియో గురించి చర్చించుకునే ముందు.. అసలు ఏంటి అశ్వమిత్ గౌతమ్ చేసిన పని. ఎందుకు ఇంత ట్రెండింగ్ లోకి వచ్చాడో తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ అశ్వమిత్ గౌతమ్. ఇతని వీడియో ఒకటి ఇటీవల ఇన్స్టా గ్రామ్ లో వైరల్ గా మారి మిలియన్స్ వ్యూస్ సంపాదించింది. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ చేసిన వీడియో యోగి ప్రభుత్వానికి వెణ్నులో వణుకు పుట్టించిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, సామాజిక అసమానతలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించాడు . ఎంతో మందిని ఆలోచింపజేస్తున్నాడు. 

కామన్ మ్యాన్ లా.. ఎదురింటి అబ్బాయిలా సహజంగా మాట్లాడుతూ..  అందరూ ఎంటర్టైన్మెంట్ వీడియో ట్రెండ్ లో కొట్టుకుపోతున్న సమయంలో.. తన చుట్టూ ఉన్న సమస్యలపై వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాను ఒక జర్నలిస్టు లేదా రాజకీయ నాయకుడు కాదని.. కామన్ మ్యాన్ వాయిస్ ను ప్రతిబింబించే వ్యక్తిని మాత్రమేనని చెప్తూ.. వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపడం తన బాధ్యత అంటూ చెప్తుంటాడు. 

ఎందుకు స్పాట్ లైట్లోకి వచ్చాడు..?

అశ్వమిత్ చేసిన కొన్ని వీడియోల్లో అతడు విమర్శించిన తీరుపై పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. పరిపాలన విధానంపై చేసిన ఘాటు విమర్శలు ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రమాదకర స్థాయిలో ఉన్న వీడియోలను పోస్ట్ చేశాడని పోలీసులు అశ్వమిత్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏ లీగల్ అంశాలతో అరెస్టు చేశారో అనే గందరగోళం ఈ కేసులో నెలకొంది. ఈ యువ క్రియేటర్ కు మద్ధతుగా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుండటం, రాజకీయ నాయకులు సహా మాట్లాడుతుండటంతో మరింత సంచలన విషయంగా మారిపోయింది. 

పోలీసులు విడుదల చేసిన తర్వాత అశ్వమిత్ సైలెన్స్ ను బ్రేక్ చేశాడు. జనవరి 19న ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇన్ స్టాలో రిలీజ్ చేసిన వీడియోలో.. పోలీసులు తనను అరెస్టు చేశారని ప్రకటించాడు. గతంలో తను చేసిన వీడియో క్లిప్స్ కట్ చేసి.. ఆ వీడియోలను వినియోగించి తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేశారని పేర్కొన్నాడు. ఇది తప్పుడు పరిణామాలకు దారితీస్తుందనే ఉద్దేశంతో మరిన్ని వీడియోలు చేయకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పాడు. 

హక్కుల ఉద్యమకారుడు సోనం వాంగ్ చుక్, స్టూడెంట్ లీడర్ ఉమర్ ఖలీద్ లతో పోల్చడాన్ని ఖండించాడు అశ్వమిత్. తన వీడియోల వెనుక వీరిద్దర పాత్ర ఉందన్న వాదనలను తోసిపుచ్చాడు. తన గొంతు నొక్కేందుకే ఇలాంటి పేర్లను తీసుకొస్తున్నట్లు చెప్పాడు. 

ప్రభుత్వం నాకు భయపడిందని అంటున్నారు. పెద్ద పెద్ద నాయకుల ఇండ్లకు ఈడీ, సీబీఐలను పంపే ప్రభుత్వాలు నాకెలా భయపడతాయి. సోనమ్ వాంగ్చుక్, ఉమర్ ఖలీద్ లాంటి వారిని జైళ్లలో వేసేంత బలం ఉన్న ప్రభుత్వాలు నాన్ను చూసి ఎందుకు అదురుకుంటాయి. నా గొంతు నొక్కేందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డాడు. 

ఆ ఘటనతో మెంటల్ స్ట్రెస్కు గరయ్యాను:

మా సోదరుడిని అరెస్టు చేయడంతో నేను మానసిక ఒత్తిడికి గురయ్యాను. నిద్రలేని రాత్రులు గడిపాను. ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చింది. సెక్షన్ 151 పెద్ద ఎఫ్ఐఆర్ ఏం కాదు.. కానీ మానసిక ఒత్తిడి మాత్రం బాగా పెరిగింది. మా సోదరుడిని తిరిగి చూశాకే నాకు మానసిక ప్రశాతంత కలిగింది.. అంటూ చెప్పుకొచ్చాడు.

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్.. వాక్ స్వాతంత్ర్యం అనేది ప్లేట్ లో వడ్డించేంత సింపుల్ కాదని.. దానికి కొట్లాడి సాధించాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ సమయంలో సిద్ధు మూసె వాలాకు చెందిన 295  సాంగ్ విన్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ పాట తనకోసమే చేసినట్లుగా అనిపించినట్లు చెప్పాడు. 

ఎఫ్ఐఆర్ లో ఏముంది..?

తనపై నమోదైన కేసు గురించి వివరించాడు అశ్వమిత్ గౌతమ్. సెక్షన్ 295 పీనల్ కోడ్ కింద తనపై ఎఫ్ ఐర్ ఆర్ నమోదైనట్లు చెప్పాడు. మత విశ్వాసాలను రెచ్చగొట్టేలా వ్యవరించినవారిపై ఈ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. పబ్లిక్ ఆర్డర్ దెబ్బతినకుండా శాంతిని నెలకొల్పేందుకు విధించే సెక్షన్ 151 కింద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే గౌతమ్ మైనర్ అయినందున రిలీజ్ చేసినప్పటికీ.. అతని సోదరుడిని 24 గంటల కస్టడీలోకి తీసుకున్నారు. 

ఎవరీ అశ్వమిత్ గౌతమ్:

అశ్వమిత్ గౌతమ్.. కేవలం 14 ఏళ్ల కుర్రాడు. స్కూళ్లో ఇచ్చే హోమ్ వర్క్ చేసుకుంటూ.. ఖాళీ సమయంలో గేమ్స్ ఆడుతూ సరదాగా గడిపే వయసులో ఉన్న విద్యార్థి. కానీ సామాజిక, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం,ద్రవ్యోల్బణం, సమాజిక అసమానతలు, ప్రభుత్వ పాలసీలు మొదలైన అంశాలపై వయసుకు మించిన జ్ఞానంతో వీడియోలు చేస్తూ వస్తున్నాడు. 2026 లో ఇన్ స్టాలో 1.9 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించాడంటే సోషల్ మీడియాను ఎలా షేక్ చేస్తున్నాడో చెప్పవచ్చు.