ఇండియా ఇక భారత్!.. పార్లమెంట్ స్పెషల్ సెషన్ లో బిల్లు పెట్టే చాన్స్

ఇండియా ఇక భారత్!.. పార్లమెంట్ స్పెషల్ సెషన్ లో బిల్లు పెట్టే చాన్స్
  • పార్లమెంట్ స్పెషల్ సెషన్ లో బిల్లు పెట్టే చాన్స్  
  •  జీ20 దేశాల ప్రతినిధులకు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ పేరుతో ఆహ్వానం
  • అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం 
  • డైవర్షన్ టీంకు మోదీ అధ్యక్షుడు: కాంగ్రెస్ 
  • ‘భారత్ మాతా’ అంటే ఎందుకు ద్వేషం? : నడ్డా  

న్యూఢిల్లీ : మన దేశం పేరు ఇండియా నుంచి భారత్​గా మారబోతోందా? పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుందా? దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ జోరుగా సాగుతోంది. జీ20 దేశాల ప్రతినిధులకు రాష్ట్రపతి పేరిట పంపిన ఇన్విటేషన్లలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని కేంద్రం అధికారికంగా పేర్కొనడంతో దుమారం రేగింది. భారత్ పేరుతో కూడిన ఇన్విటేషన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, దేశం పేరు మార్పు అంశంపై అధికార బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేయగా.. ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీలు తీవ్రంగా స్పందించాయి. 

కేంద్ర మంత్రి ట్వీట్​తో..

జీ20 దేశాల ప్రతినిధులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందుకు సంబంధించిన ఇన్విటేషన్​ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం ట్విట్టర్​లో షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ఇన్విటేషన్ వైరల్ అయింది. శనివారం ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 సమిట్ సందర్భంగా డిన్నర్ కు ‘ప్రెసిడెంట్ ఆఫ్​ భారత్’ ఆహ్వానించారని అందులో  కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 
‘ప్రెసిడెంట్ ఆఫ్​ భారత్’ హ్యాష్ ట్యాగ్ తో ‘జన గణ మన అధినాయక జయహే, భారత భాగ్య విధాత’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.  అలాగే విదేశీ ప్రతినిధుల కోసం రూపొందించిన జీ20 బుక్ లెట్ లోనూ కేంద్రం భారత్ అనే పేరునే వాడింది. ‘భారత్, ది మదర్ ఆఫ్ డెమోక్రసీ’ అంటూ ఈ బుక్ లెట్ కు టైటిల్ పెట్టడంతో పాటు అందులో ఇండియాకు బదులుగా భారత్ పేరునే పేర్కొన్నారు. ‘భారత్ అనేది మా దేశం అధికారిక పేరు. రాజ్యాంగంలో కూడా ఈ పేరును ప్రస్తావించారు’ అని బుక్ లెట్ లో కేంద్రం వివరించింది.  

మాటల యుద్ధం 

కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా ఇండియా బదులు భారత్ అనే పేరును వాడటంతో ఇటు అధికార ఎన్డీయే, అటు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. 
ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే దేశం పేరు మార్పు కోసం ప్రయత్నిస్తోందంటూ ప్రతిపక్ష నేతలు విమర్శించారు. అయితే, భారత్ అనే పదం రాజ్యాంగంలోనే ఉందని, దానిని వాడటంలో ఎలాంటి తప్పు లేదని అధికార బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. బానిసత్వపు ఆనవాళ్లకు గుర్తుగా ఉన్న ఇండియా అనే పదాన్ని చెరిపేయాల్సిందేనని స్పష్టం చేశారు. 

రుగ్వేద కాలం నుంచి రాజ్యాంగం వరకూ  

భారత్ పేరుకు మూలాలు రుగ్వేద కాలంలోనే మొదలై నేటి రాజ్యాంగం వరకూ ఉన్నాయి. మహాభారతం, మనుస్మృతి వంటి గ్రంథాలు, పురాణాల్లోనూ భారత ప్రస్తావన ఉంది. భరత చక్రవర్తి పాలించినందున భరత ఖండం అనే పేరు వచ్చిందని మొదటి ప్రధాని నెహ్రూ కూడా తన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో రాశారు. ఇండియా, హిందూస్థాన్, భారత్ అనే పదాలపై చర్చ పట్ల కూడా ఆయన అందులో ప్రస్తావించారు. అయితే, మన దేశం పేరును ఇంగ్లిష్ లో మాత్రమే ఇండియా అని పిలుస్తున్నాం. హిందీ, ఇతర భారతీయ భాషల్లో భారత్ అనే పేర్కొంటున్నాం. ద్రవిడ భాషల్లో కూడా ఇదే పదం వాడుతున్నాం. తమిళంలో భారత అని, మలయాళంలో భారతం అని, తెలుగులో భారతదేశం అని అంటున్నాం. హిందీలో రాజ్యాంగాన్ని ‘భారత్ కా సంవిధాన్’ అని పిలుస్తున్నాం. అలాగే ఆర్టికల్ 1లో ‘భారత్ అర్థాత్ ఇండియా, రాజ్యోం కా సంఘ హోగా’ అంటూ పేర్కొన్నారు. పాస్ పోర్టులపై రిపబ్లిక్ ఆఫ్​ఇండియా అని ఇంగ్లిష్ లో, దానితోపాటు భారత్ గణరాజ్య అని హిందీలో రాస్తున్నా దీనిపై ఎప్పుడూ కన్ఫ్యూజన్ తలెత్తలేదు. అలాగే సంస్కృతంలో సింధు (ఇండస్) అనే పదం పర్షియన్ భాషలో హిందూగా మారగా, దాని నుంచే హిందూస్థాన్ పేరు పుట్టింది. అలాగే ఇండస్, ఇండియా అనే పదాలను గ్రీకులు మొదట ఉపయోగించారు.  

డైవర్షన్ టీంకు మోదీ అధ్యక్షుడు : జైరాం రమేశ్ 

దేశం పేరు మార్పుపై వస్తున్న వార్తలు నిజమేనని ఇప్పుడు రాష్ట్రపతి ఇన్విటేషన్లతో తేలిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ అన్నారు. ఇప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ‘‘భారత్, ఒకప్పుడు ఇండియా, రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది” అని చదువుకోవాలేమో.. కానీ ఇప్పుడు రాష్ట్రాల సమాఖ్య వ్యవస్థ కూడా దాడికి గురవుతోంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. చరిత్రను నాశనం చేసి, దేశాన్ని విభజించడమే ప్రధాని మోదీ పని అంటూ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, న్యూ ఇండియా వంటి పదాలను ముందుకు తెస్తే.. తాము మాత్రం భారత్ జోడో యాత్రతో ముందుకొచ్చామన్నారు. ప్రజల దృష్టిని మళ్లించే ‘వెపన్ ఆఫ్​ మాస్ డైవర్షన్’ ఫ్యాక్టరీకి మోదీ అధ్యక్షుడని విమర్శించారు. కంపెనీల మూత, రైతు సమస్యలు, చైనా ఆక్రమణ, అదానీ స్కాం, మణిపూర్ హింస వంటి అన్నింటిలోనూ ఆయన ప్రజలను డైవర్ట్ చేసేందుకు 
ప్రయత్నించారన్నారు. 

పేరు మార్చాల్సిన అవసరమేముంది? : మమత  

దేశం పేరును ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అవసరం ఏముందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. ‘‘ఇండియా అంటే భారత్ అని అందరికీ తెలుసు. ఇందులో కొత్తేముంది? కేవలం భారత్ అని మాత్రమే పిలవాల్సిన అవసరం ఏముంది?” అని ప్రశ్చించారు. ‘‘ఇండియా పేరు మారుస్తున్నారని తెలిసింది. జీ20 ఇన్విటేషన్ లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా పేర్కొన్నారు. మనం ఇంగ్లిష్ లో ఇండియా అంటం. అదే రాజ్యాంగాన్ని ‘ఇండియన్ కానిస్టిట్యూషన్’ అని అంటం. హిందీలో ‘భారత్ కా సంవిధాన్’ అని పిలుస్తాం. మనం ప్రపంచమంతటికీ ఇండియాగా తెలుసు. ఇప్పటికిప్పుడు పేరు మార్చాల్సిన అవసరం ఏముంది?”  అని ఆమె అన్నారు. 

మేం ‘భారత్’గా మారిస్తే.. మళ్లీ మారుస్తరా?: కేజ్రీవాల్   

ప్రతిపక్షాల కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టుకున్నందుకే.. బీజేపీ ప్రభుత్వం దేశం పేరును భారత్ గా మార్చాలని చూస్తున్నదని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ‘‘నాకు దీనిపై అధికారిక సమాచారం లేదు. కానీ కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలన్నీ కలిసి ‘ఇండియా’ పేరుతో కూటమి ఏర్పాటు చేసుకోవడంతో బీజేపీలో కలవరం మొదలైంది. అందుకే ఇలా చేస్తోంది. ఒకవేళ ‘ఇండియా’ కూటమి పేరును ‘భారత్’ గా మారిస్తే.. అప్పుడు మళ్లీ ‘భారత్’ పేరును కూడా మారుస్తారా?” అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.  

రాజ్యాంగంలో ఏముంది? 

మన దేశాన్ని ఏ పేరుతో పిలవాలన్న అంశాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో పేర్కొన్నారు. ఆర్టికల్ 1 డ్రాఫ్ట్ ను కాన్ స్టిట్యూయెంట్ అసెంబ్లీ 1949, సెప్టెంబర్ 18న ఆమోదించింది. దేశం పేరుపై చర్చ సందర్భంగా భారత్, హిందూస్థాన్, హింద్, భారత్ భూమి, భరత్ వర్ష్ వంటి పేర్లతో డ్రాఫ్ట్ కమిటీ సభ్యుల నుంచి అనేక సూచనలు వచ్చాయి. కమిటీలోని కొందరు సభ్యులు భారత్ అనే పేరుకు, ఇతర సభ్యులు ఇండియా అనే పేరు పెట్టేందుకు మొగ్గు చూపారు. దీంతో ఆర్టికల్ 1(1)లో పేర్కొన్న ‘ఇండియా అంటే భారత్, రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది’ అన్న ప్రకటనకు కాన్​స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మన దేశాన్ని అధికారికంగా ఏ పేరుతో పిలవాలన్న దానికి సంబంధించి రాజ్యాంగంలో ఉన్న ఏకైక వివరణ ఇదే.   

సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 

ఇండియా పేరును భారత్ గా మార్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇదే విషయంపై గతంలో సుప్రీంకోర్టులో రెండు సార్లు పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. అయితే, ఆ పిటిషన్లను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు కీలక కామెంట్లు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1ని సవరించి, దేశం పేరును భారత్ గా మార్చాలని కోరుతూ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఒకరు 2020లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.‘‘ఇండియా అనే పదం గ్రీకు భాషలోని ఇండికా అనే పదం నుంచి పుట్టింది. ఇండియా అనే ఇంగ్లిష్ పేరు దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించడం లేదు. దేశం పేరును భారత్ అని మార్చడం వల్ల బానిసత్వపు పాలన గుర్తులను పౌరులు చెరిపేసుకునేందుకు వీలవుతుంది” అని పిటిషనర్ పేర్కొన్నారు. ఇండియా పేరును భారత్ గా మార్చడం ద్వారా.. మన పూర్వికులు ప్రాణాలొడ్డి సాధించిన స్వాతంత్ర్యానికి  న్యాయం చేసినట్లు అవుతుందన్నారు. అయితే, ఈ పిటిషన్ ను అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శరద్ బాబ్డే బెంచ్ కొట్టివేసింది. ‘‘రాజ్యాంగంలో భారత్, ఇండియా అనే రెండు పేర్లూ ఉన్నాయి. రాజ్యాంగంలో ఇండియాను ఆల్రెడీ భారత్ అని పిలుస్తున్నారు కదా” అంటూ తీర్పు సందర్భంగా సీజేఐ శరద్ బాబ్డే కామెంట్ చేశారు. దీనికంటే ముందు 2016లోనూ సుప్రీంకోర్టులో ఇలాంటిదే ఓ పిటిషన్ దాఖలైంది. దానిని అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ తిరస్కరించారు. ‘‘దేశాన్ని ఇండియా అని పిలవాల్నా? లేదంటే భారత్ అని పిలవాల్నా? అన్నది నిర్ణయించుకునే హక్కు ప్రతి భారతీయుడికీ ఉంది. ఒక పౌరుడు దేశాన్ని ఏ పేరుతో పిలవాలన్నది సుప్రీంకోర్టు నిర్ణయించలేదు” అంటూ సీజేఐ ఠాకూర్ కామెంట్ చేశారు.

అమితాబ్ 'భారత్ మాత' పోస్ట్ వైరల్ 

'ఇండియా' పేరు మార్పుపై చర్చ జరుగుతున్న వేళ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ "భారత్ మాతా కీ జై " అని ట్వీట్ చేశారు. తన పోస్టుకు ఎడమ వైపున దేశ జెండాను, కుడివైపున కాషాయ జెండాను జోడించారు. ఈ ట్వీట్‌లో ఆయన ఇంకేమీ ప్రస్తావించనప్పటికీ ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. దీనిపై అమితాబ్ బచ్చన్‌ను కొందరు నెటిజన్లు ట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇంకొందరు మద్దతుగా నిలుస్తున్నారు. ఒకరు 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, అఖంఢ భారత్' అని కామెంట్ చేయగా.. మరొకరు' మీకు బీజేపీ టిక్కెట్ దక్కనుందా?' అని ప్రశ్నించారు. భారత్ లోనైనా పెట్రోల్ ధర తగ్గుతుందా అని ఇంకొకరు కామెంట్ చేయగా.. బిగ్ బీ కూడా దేశాన్ని ద్వేషిస్తున్నారా? అని మరొకరు స్పందించారు.  

ఇండోనేషియాకు పంపిన లేఖలో కూడా భారత్​

ఇండియాకు బదులుగా భారత్ అనే పేరును కేంద్ర ప్రభుత్వం మరోసారి అధికారికంగా వాడింది. ప్రధాని మోదీ బుధవారం ఇండోనేసియాలో ఆసియాన్ సదస్సుకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇండోనేసియా ప్రభుత్వానికి రాసిన అధికారిక సమాచారంతో కూడిన లేఖలో మోదీని ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ అంటూ ప్రస్తావించారు. ఈ లేఖను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మంగళవారం రాత్రి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

‘భారత్ మాతాకీ జై’  అంటే ఎందుకు ద్వేషం?: నడ్డా  

దేశం, రాజ్యాంగం, రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్​పార్టీకి గౌరవం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భారత్ మాతాకీ జై అనే నినాదాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎందుకు ద్వేషిస్తున్నదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓ కుటుంబం గొప్పదనాన్ని చాటేందుకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాజస్తాన్​లో జరిగిన మీటింగ్​లో భారత్​ మాతాకీ జై అని నినదించిన కాంగ్రెస్​సభ్యులను ఆ పార్టీ సీనియర్​నేత మందలించడం ఏమిటని తప్పుపట్టారు.

పేరు మార్చాలంటే ఏం చేయాలి?

రాజ్యాంగంలో ఇండియా, భారత్ అనే రెండు పేర్లూ ఉన్నాయి. వీటిలో దేనినైనా అధికారికంగా వాడుకోవచ్చు. ఇందుకు ఇబ్బందేమీ లేదు. కానీ రాజ్యాంగం నుంచి ఇండియా అనే పదాన్ని తొలగించి, భారత్ అనే పదాన్ని మాత్రమే ఉంచాలంటే మాత్రం అందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి ఆర్టికల్ 1కి సవరణ చేయాలి. అయితే, రాజ్యాంగ సవరణ చేసేందుకు ఆర్టికల్ 368లో సింపుల్ మెజారిటీ లేదా స్పెషల్ మెజారిటీ అనే రెండు విధానాలను పేర్కొన్నారు. రాజ్యసభలో స్టేట్స్, యూటీలకు సీట్ల కేటాయింపు, మార్పుల వంటి వాటికి సింపుల్ మెజారిటీ సరిపోతుంది. అంటే.. హాజరైన మొత్తం సభ్యుల్లో 50% కంటే ఎక్కువ ఓట్లు సవరణకు అనుకూలంగా రావాలి. కానీ ఆర్టికల్ 1లోని దేశం పేరు, ఇతర అంశాలను మార్చాలంటే మాత్రం స్పెషల్ మెజారిటీ తప్పనిసరి. ఇందుకోసం పార్లమెంట్ ఉభయసభలకు ఓటింగ్ జరగాలి. హాజరైన మొత్తం సభ్యుల్లో కనీసం 66% ఓట్లు రావాలి.