వందే భారత్ భోజనంపై రచ్చ : ప్లాస్టిక్ ప్యాకెట్లను మైక్రోవేవ్‌లో వేడి చేయడంపై ప్రయాణీకుల ఆందోళన!

వందే భారత్ భోజనంపై రచ్చ :  ప్లాస్టిక్ ప్యాకెట్లను మైక్రోవేవ్‌లో వేడి చేయడంపై ప్రయాణీకుల ఆందోళన!

అలహాబాద్ నుండి ఢిల్లీకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ, రైలులో అందించే  ఆహారం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సీల్ చేసిన ప్లాస్టిక్ కవర్ ప్యాకెట్లలో ఉన్న రోటీలు, కచోరీలను డైరెక్ట్  మైక్రోవేవ్‌లో వేడి చేసి ఇవ్వడం ఏంటి అని ఆమె తప్పుబట్టారు.

 ప్లాస్టిక్ ప్యాకెట్లను మైక్రోవేవ్‌లో వేడి చేశారా అని ఆమె సిబ్బందిని అడగ్గా... దానికి సిబ్బంది మీకు చల్లటి ఆహారం కావాలా ? అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ప్యాకెట్ మీద ఈ ప్యాకెట్ చల్లని ప్రదేశంలో ఉంచండి అని ఉంది కానీ, మైక్రోవేవ్‌లో వేడి చేయవచ్చు అని ఎక్కడా లేదు. ప్లాస్టిక్‌ను అలా వేడి చేస్తే హానికరమైన రసాయనాలు ఆహారంలోకి చేరుతాయని ఆమె మండిపడ్డారు.

ప్యాకెట్ కట్ చేసి ఓపెన్ చేయకుండానే వేడి చేసినట్లు సిబ్బంది ఒప్పుకున్నారు. దీంతో ఆమె సోషల్ మీడియా ద్వారా  రైల్వే అధికారులను ప్రశ్నించారు. ఆహార నిపుణుల ప్రకారం, మైక్రోవేవ్-సేఫ్ అని రాసి లేని ప్లాస్టిక్‌ను వేడి చేస్తే కెమికల్స్ లీకేజీ అంటే  ప్లాస్టిక్‌లోని BPA లేదా థాలేట్స్ వంటి రసాయనాలు ఆహారంలో కలుస్తాయి. అంతేకాకూండా ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి, శరీరానికి చాలా హాని చేస్తాయి.

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో IRCTC స్పందించింది. ఆమె ప్రయాణ వివరాలు (PNR నంబర్) అడిగి తెలుసుకున్న అధికారులు, ఈ విషయంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పోస్ట్ చూసిన చాలా మంది ప్రయాణికులు రైల్వే భోజన నాణ్యతను విమర్శిస్తున్నారు. ప్రీమియం రైళ్లలో కూడా ఇలాంటి పద్ధతులు పాటించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. విమానాల్లోలాగా సురక్షితమైన ప్యాకేజింగ్ పద్ధతులు వాడాలని సూచిస్తున్నారు.