వైఎస్‌ఆర్ సంస్మరణ సభ.. షర్మిల పార్టీ కోసమేనా?

వైఎస్‌ఆర్ సంస్మరణ సభ.. షర్మిల పార్టీ కోసమేనా?

ఉమ్మడి ఏపీ సీఎం , దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్‌ఆర్‌‌ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హైదరాబాద్ లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఆహ్వానించారు. స్వయంగా కొద్దిమంది నేతలకు విజయమ్మే ఫొన్ చేసినట్టు తెలుస్తోంది.  గతంలో వైఎస్ తో కలిసి పనిచేసిన ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర రంగాల్లోని ప్రముఖులను ఆహ్వానించారు విజయమ్మ. ఇక కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ కు నివాళి కార్యక్రమానికి అటెండయ్యారు జగన్, షర్మిల. అయితే అన్నా , చెల్లెళ్లు కనీసం పలకరించకోలేదు. ఇదే కార్యక్రమానికి విజయమ్మ కూడా హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం ఇదే ఇడుపులపాయలో జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమానికి విడివిడిగా వెళ్లారు జగన్, షర్మిల. ఇవాల్టి వర్థంతి కార్యక్రమంలో ఇద్దరు నేతలు ఒకే సమయంలో హాజరైనా అక్కడ ఎలాంటి పలకరింపులు లేవు.

ఇక తెలంగాణలో షర్మిల పార్టీపై ఇప్పటివరకు స్పందించలేదు వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ లో ఆత్మయ సమ్మేళనం జరుగుతున్న టైమ్ లోనే షర్మిల చేసిన ట్వీట్ పై అంతటా చర్చ జరుగుతోంది. ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలు ఎదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి  ప్రోత్సహించి న్ను మీ కంటిపాపలా చూసుకున్నారు.... నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది. ఈ రోజు నా కన్నీరు ఆగనంటోంది... అంటూ ట్వీట్ చేశారు షర్మిల. ఇక  ఇవాళ్టి వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి ఏపీ మంత్రి బొత్సతో పాటు ముఖ్య నేతలకు ఆహ్వానాలు వెళ్లాయి. అయితే పార్టీ ఆదేశాలతో వారు హాజరుకావొద్దని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో షర్మిల పార్టీ కోసమే విజయమ్మ ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారనే ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు నేపథ్యంలో విజయమ్మ ఆత్మీయ సమ్మేళనం రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది. వైఎస్ చనిపోయిన 12 ఏళ్లకు మీటింగ్ పెట్టడం ఏంటనే చర్చ జరుగుతోంది. అప్పట్లో వైఎస్ తో ఉన్న నేతలంతా కాంగ్రెస్ లో ఉన్నారు. ఇంకా కొంతమంది అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ శంకుస్థాపన కార్యక్రమం ఉండడంతో వారంతా అక్కడకు వెళ్లారు. ఒకవేళ హైదరాబాద్ లో ఉన్న నేతలు ఆత్మీయ సమ్మేళనానికి వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం మీటింగ్ కు వెళ్తానని చెప్పారు. మాజీ ఎంపీ కేవీపీ కూడా మీటింగ్ కు వెళ్తానని తెలిపారు. అటు ఎంఐఎం చీఫ్ , ఎంపీ అసదుద్దీన్ వైఎస్ అంటే తమకు అభిమానం ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మేళనానికి వెళ్లడం కుదరడం లేదన్నారు.