సముద్రఖని, ఐశ్వర్య రాజేష్, సునీల్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో గ్యారీ బీహెచ్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’. ఏడు ఎపిసోడ్ల ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను ప్రశాంత్ రఘతి రచించగా, తాజుద్దీన్ సయ్యద్ మాటలు అందించారు. రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు.
జులై 2 నుంచి ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వస్తోంది. సోమవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఒక కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ఉత్కంఠభరిత కథ ఇది. అధికారం కోసం మనుషులు ఎంత దూరమైనా వెళ్లగలరు అనే విషయాన్ని ఈ సిరీస్‌తో చూపిస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో సముద్రఖని మాట్లాడుతూ ‘ఈ కథలోని బలమైన భావోద్వేగాలు, నా పాత్రలో ఉన్న వైవిధ్యాలు నన్ను ఆకట్టుకున్నాయి. ఆశ, ప్రతీకారం, అధికారం కోసం మనుషులు ఎంత దూరమైనా వెళ్తారనే విషయాన్ని ఈ కథ బలంగా చెబుతుంది.
నా కెరీర్‌లో ఇప్పటివరకు చేయని భిన్నమైన పాత్ర ఇది’ అని చెప్పారు. ఇందులో తన రోల్ చాలా స్పెషల్ అని ఐశ్వర్య రాజేష్ చెప్పింది. ఈ సిరీస్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని దర్శకుడు గ్యారీ బీహెచ్ అన్నాడు. సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్ పాల్గొన్నారు.
