V6 News

అమెరికాతో ఇరాన్ రెండో విడత చర్చలు!..ఇస్లామాబాద్ చేరుకున్న ఇరు దేశాల నేతలు.. 10 వేల మందితో భారీ భద్రత

అమెరికాతో ఇరాన్ రెండో విడత చర్చలు!..ఇస్లామాబాద్ చేరుకున్న ఇరు దేశాల నేతలు.. 10 వేల మందితో భారీ భద్రత
  • ఇషాక్ దార్​కు అబ్బాస్ అరాఘ్చీ ఫోన్
  • అమెరికాతో రెండో విడత చర్చలు!
  • ఇస్లామాబాద్‌‌లో 10 వేల మందితో భారీ భద్రత

ఇస్లామాబాద్: అమెరికాతో రెండో విడత శాంతి చర్చలు జరిపేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ బృందం శుక్రవారం రాత్రి ఇస్లామాబాద్‌‌కు చేరుకుంది. అమెరికాకు చెందిన లాజిస్టిక్స్, భద్రతా బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి శాంతి చర్చలు జరిపేందుకు తన దౌత్య ప్రయత్నాలను  పాకిస్తాన్ ముమ్మరం చేసింది. శుక్రవారం పాక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఫోన్ చేసి మాట్లాడారు. ప్రాంతీయ పరిణామాలు, కాల్పుల విరమణ,  అమెరికా, ఇరాన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు పాకిస్తాన్ చేస్తున్న కృషిపై చర్చించారు. ఈ సందర్భంగా రీజనల్ స్టెబిలిటీ కోసం నిరంతర చర్చలు జరగాలని ఇషాక్ దార్ కోరగా..ఈ విషయంలో పాక్ పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను అరాఘ్చీ అభినందించారు.

ఇస్లామాబాద్‌‌లో హై అలర్ట్

 ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య రెండో రౌండ్ శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయనే వార్తల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. గత ఐదురోజులుగా ఇస్లామాబాద్‌‌లో కట్టుదిట్టమైన భద్రతను అమలు చేస్తున్నారు. పాక్ సైన్యం ఇస్లామాబాద్‌‌ను పూర్తి దిగ్బంధంలో ఉంచింది. చర్చల నిమిత్తం అమెరికా, ఇరాన్ అగ్రనేతలు ఏ క్షణమైనా రావచ్చుననే అంచనాతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సుమారు 10,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. నూర్ ఖాన్ ఎయిర్‌‌బేస్ పరిసర ప్రాంతాలను సీజ్ చేయడంతో పాటు, మెట్రో బస్సు సర్వీసులు,ఎలక్ట్రిక్ బస్సులను నిలిపివేశారు.