లెబనాన్‌‌ పై ఇజ్రాయెల్‌‌ దాడి.. 16 మంది మృతి... మరో 58 మందికి గాయాలు

లెబనాన్‌‌ పై ఇజ్రాయెల్‌‌ దాడి..  16 మంది మృతి... మరో 58 మందికి గాయాలు
  •     మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు..

టెల్‌‌అవీవ్‌‌: ఇజ్రాయెల్‌‌ దాడులతో దక్షిణ లెబనాన్‌‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గురువారం ఇజ్రాయెల్‌‌ సైన్యం భారీ స్థాయిలో బాంబు దాడులు చేయడంతో 16 మంది చనిపోయారు. మరో 58 మంది గాయపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నట్లు లెబనాన్‌‌ ప్రభుత్వ మీడియా తెలిపింది. నబాతియెహ్‌‌ ప్రాంతంలో జరిగిన దాడిలో లెబనాన్‌‌ సైన్యానికి చెందిన ఓ సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కొద్దిరోజులుగా లెబనాన్‌‌లోని నివాస ప్రాంతాలు, రోడ్లు, మౌలిక వసతులపై ఇజ్రాయెల్‌‌ దాడులు చేస్తోంది. 

దక్షిణ లెబనాన్‌‌, వెస్టర్న్‌‌ బెకా వ్యాలీ ప్రాంతాల్లో సైనికులపై కూడా దాడులు పెరిగాయి. టైర్‌‌ నగరంలో ఓ భవనంపై జరిగిన వైమానిక దాడులతో భారీగా మంటలు చెలరేగాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్స్‌‌ పనిచేస్తున్నాయి. హెజ్బుల్లా గ్రూప్‌‌కు చెందిన మౌలిక వసతులనే టార్గెట్‌‌ చేస్తున్నామని చెప్తున్న ఇజ్రాయెల్‌‌.. సాధారణ ప్రజల నివాస ప్రాంతాలనూ వదిలిపెట్టట్లేదు. టైర్‌‌ సహా దక్షిణ లెబనాన్‌‌ ప్రాంతాల ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌‌ ఆదేశాలు జారీ చేసింది. తాము దాడి చేయబోయే ప్రాంతాలివేనని పేర్కొంటూ లెబనాన్‌‌లోని కొన్ని భవనాల లిస్ట్‌‌ను ఇజ్రాయెల్‌‌ సోషల్‌‌ మీడియాలో రిలీజ్‌‌ చేయడంతో ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగాయి.

గాజాలో 10 మంది మృతి

గాజాపైనా ఇజ్రాయెల్‌‌ దాడులు ఆగట్లేదు. గాజా సిటీలోని ఓ నివాస భవనంపై జరిగిన వైమానిక దాడిలో 10 మంది మృతిచెందగా, అందులో నలుగురు చిన్నారులున్నారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. కాల్పుల విరమణ అమల్లో ఉందని ప్రకటించినప్పటికీ, దాడులు కొనసాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హమాస్‌‌ మిలిటరీ వింగ్‌‌ చీఫ్‌‌ మహమ్మద్‌‌ ఒడెహ్‌‌ అంత్యక్రియలు జరిగిన కొద్ది గంటలకే ఈ దాడి జరిగింది. 

మంగళవారం ఇజ్రాయెల్‌‌ జరిపిన దాడుల్లో ఒడెహ్‌‌, ఆయన భార్య, కొడుకు మరణించారు. కాగా,  కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌‌ 3 వేలసార్లకుపైగా ఉల్లంఘించిందని గాజా ప్రభుత్వ మీడియా ఆరోపించింది. ఒప్పందం ప్రకారం గాజాలోకి రావాల్సిన 1,35,600 సహాయక ట్రక్కులకుగాను.. కేవలం 49,973 ట్రక్కుల మాత్రమే గాజాలోకి వచ్చాయని తెలిపింది. దీంతో గాజాలో మానవతా సంక్షోభం మరింత తీవ్రమవుతోందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.