కాల్పులకు 4 రోజులు బ్రేక్​.. ఇజ్రాయెల్– హమాస్ మధ్య కుదిరిన ఒప్పందం

కాల్పులకు 4 రోజులు బ్రేక్​.. ఇజ్రాయెల్– హమాస్ మధ్య కుదిరిన ఒప్పందం
  • ఖతర్, ఈజిప్టు మధ్యవర్తిత్వం సఫలం
  • ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం
  • తాత్కాలిక విరామమే..యుద్ధం ఆపేదిలేదన్న నెతన్యాహు

గాజా/జెరూసలెం: గాజా స్ట్రిప్​లో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ గ్రూప్ మధ్య ఒప్పందం ఓకే అయింది. నాలుగు రోజుల పాటు కాల్పులు ఆపేందుకు ఇరుపక్షాలూ అంగీకారానికి వచ్చాయి. ఒప్పందంలో భాగంగా 50 మంది బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ ఒప్పుకుంది. ప్రతిగా 150 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ కూడా ఓకే చెప్పింది. అలాగే గాజాలోకి ఫ్యూయెల్, నిత్యావసరాలు, మందులతో కూడిన అదనపు ట్రక్కులను అనుమతించేందుకు కూడా ఇజ్రాయెల్ అంగీకరించింది. ఒప్పందం అమలులో ఉండే నాలుగు రోజుల పాటు అటు ఇజ్రాయెల్, ఇటు హమాస్ ఎలాంటి కాల్పులు, రాకెట్ దాడులు చేయకూడదని అగ్రిమెంట్​లో పేర్కొన్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం వెనక ఖతర్, ఈజిప్టు దేశాలు కీలక పాత్ర పోషించాయి. హమాస్​తో డీల్​కు బుధవారం ఉదయం కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఇజ్రాయెల్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉంటుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలీ కోహెన్ వెల్లడించారు. గురువారం తొలి విడత బందీల విడుదల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. రోజూ 12–13 మంది రిలీజ్ కానున్నారని చెప్పారు. ఇజ్రాయెల్ జైళ్లలోని పాలస్తీనియన్ ఖైదీల్లో 300 మందిని విడిచిపెట్టేందుకు ఓకే చెప్తూ ఇజ్రాయెల్ న్యాయశాఖ వారి పేర్లతో లిస్ట్ విడుదల చేసింది.

ఇదీ ప్రాసెస్..

మిలిటెంట్లు ముందుగా బందీలను రెడ్ క్రాస్ సిబ్బందికి అప్పగించాలి. రెడ్ క్రాస్ సిబ్బంది ఐడీఎఫ్ బలగాలకు అప్పగిస్తారు. ఆ తర్వాత ఐడీఎఫ్ వారిని ఇజ్రాయెల్ కు తీసుకెళ్లి మెడికల్ చెకప్స్ నిర్వహించి, వారి కుటుంబసభ్యులతో భేటీ ఏర్పాటు చేస్తుంది. అనంతరం ఆర్మీ అధికారులు విచారించి, సమాచారం సేకరించాకే బందీలను పూర్తిగా విడిచిపెడతారు.

వేట కొనసాగుతది..

కాల్పుల విరమణ ఒప్పందానికి కేబినెట్ ఓకే చెప్పడానికి ముందు నెతన్యాహు మాట్లాడుతూ.. ఒప్పందం ముగిసిన తర్వాత గాజాలో హమాస్​పై దాడులు కొనసాగిస్తామని స్పష్టంచేశారు. బందీల  విడుదలతోపాటు హమాస్​ను నిర్మూలించే దాకా యుద్ధం ఆపే ప్రసక్తే లేదన్నారు. గాజాలో గ్రౌండ్ అటాక్ చేపట్టినందుకే హమాస్ దిగి వచ్చిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ గాలంట్ అన్నారు. కాల్పుల విరమణ ముగిశాక మరింత తీవ్రంగా దాడులు చేస్తామన్నారు.