ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్న వేళ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఇజ్రాయెల్‌ను దుర్మార్గమైన దేశమని, మానవాళికి శాపమని పేర్కొంటూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను నిరసిస్తూ శనివారం ఖవాజా ఆసిఫ్ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ‘ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరుగుతుంటే లెబనాన్‌లో మారణహోమం కొనసాగుతోంది.
గాజా, ఇరాన్ తర్వాత ఇప్పుడు లెబనాన్‌లో అమాయక పౌరులను ఇజ్రాయెల్ పొట్టనబెట్టుకుంటోంది. ఈ క్యాన్సర్ లాంటి దేశాన్ని సృష్టించిన వారు నరకంలో కాలిపోతారు’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ‘శాంతిని నెలకొల్పే మధ్యవర్తిగా చెప్పుకుంటున్న ఏ ప్రభుత్వం నుంచి ఇలాంటి వ్యాఖ్యలను సహించబోం’ అని నెతన్యాహు హెచ్చరించారు.తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం కావడంతో ఖవాజా ఆసిఫ్ తన వివాదాస్పద పోస్ట్‌ను డిలీట్ చేశారు.
