- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు
- మరో రెండు పట్టణాలపై
- ఐడీఎఫ్ అటాక్స్
- నివాస ప్రాంతాలపై బాంబులు.. ఇండ్లు ధ్వంసం
- గడిచిన 24 గంటల్లోనే
- 50 చోట్ల అటాక్స్
- వాషింగ్టన్‌లో చర్చలకు ఇజ్రాయెల్, లెబనాన్ అంగీకారం
టెల్ అవీవ్/బీరుట్: ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చినప్పటికీ, మరోవైపు లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ బలగాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. లెబనాన్‌పై దాడులను తగ్గించాలంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చినప్పటికీ ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. శుక్రవారం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్‌లోని మరో రెండు పట్టణాలపై వైమానిక దాడులు జరిపాయి.
లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులను తగ్గిస్తోందని, దాడులు అంత తీవ్రంగా ఉండవని నెతన్యాహు తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ఎన్‌బీసీ న్యూస్‌కు చెప్పిన కొద్ది గంటలకే ఈ తాజా దాడులు జరిగాయి. దీంతో అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ, దానికి ప్రతిస్పందనగా ఉత్తర ఇజ్రాయెల్ పట్టణాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు లెబనాన్ లోని ఇరాన్ మిత్రపక్షం హెజ్బొల్లా తెలిపింది. శుక్రవారం ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దు సమీపంలోని కిర్యాత్ ష్మోనా, ఉత్తర ఇజ్రాయెల్‌లోని మిస్గావ్ ఆమ్ ప్రాంతాలపై తాము రాకెట్లు ప్రయోగించినట్లు ఆ రాజకీయ, సైనిక సంస్థ ప్రకటించింది.
‘మా దేశం, ప్రజలపై ఇజ్రాయెల్ -అమెరికా దురాగతాలు ఆగే వరకు మా స్పందన ఇలాగే కొనసాగుతుంది’ అని ఆ సంస్థ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, బుధవారం కాల్పుల విరమణ ప్రకటించిన కొద్ది గంటల్లోనే, ఇజ్రాయెల్ ఎటువంటి హెచ్చరిక లేకుండా మధ్య బీరుట్‌లోని వాణిజ్య, నివాస ప్రాంతాలపై దాడులు జరిపింది. కేవలం పది నిమిషాల్లోనే వంద దాడులు చేయడంతో దాదాపు 300 మంది మరణించగా, 1,000 మందికి పైగా గాయపడ్డారు.
గత 24 గంటల్లో 50కిపైగా దాడులు..
గత 24 గంటల్లో ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్ అంతటా 50కి పైగా దాడులు జరిపాయి. శుక్రవారం దక్షిణ పట్టణమైన హన్నావియాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఒకరు మరణించగా, మరొకరు గాయపడ్డారని లెబనాన్ జాతీయ వార్తా సంస్థ తెలిపింది. ఐతా అల్-షాబ్ ప్రాంతంలోని నివాస గృహాలను ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయని, టైర్ జిల్లాలోని అల్-మజాడెల్‌పై మరిన్ని దాడులు జరిగాయని ఈ సంస్థ పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని హనీన్ పట్టణంలో ఇజ్రాయెల్ దళాలు ఇళ్లను పేల్చివేసినట్లు అల్ జజీరా ప్రతినిధుల బృందం నివేదించింది.
దీనికి ప్రతిస్పందనగా హెజ్బొల్లా గ్రూపు ఉత్తర ఇజ్రాయెల్‌లోని కిర్యాత్ ష్మోనా, మెటులా, మిస్గావ్ ఆమ్ వంటి స్థావరాలపై రాకెట్లను ప్రయోగించింది. ‘దేశం, ప్రజలపై ఇజ్రాయెల్–-అమెరికా దురాగతాలు ఆగే వరకు ఈ దాడులు కొనసాగుతాయి’ అని ఆ సంస్థ ప్రకటించింది. అయితే, దక్షిణ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, బుధవారం నాటి భారీ దాడుల తర్వాత బీరుట్‌లో పరిస్థితి కొంత ప్రశాంతంగా ఉన్నట్లు అల్ జజీరా ప్రతినిధి జైనా ఖోద్ర్ తెలిపారు.
అలాగే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశించిన బీరుట్‌లోని రెండు ఆసుపత్రులపై దాడులు జరగవని తమకు హామీ లభించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ శుక్రవారం తెలిపింది. రఫీక్ హరీరీ యూనివర్సిటీ ఆసుపత్రి, అల్ జహ్రా ఆసుపత్రుల్లో సుమారు 450 మంది రోగులు ఉన్నారని, వారిని తరలించడం సాధ్యం కాదని డాక్టర్ అబ్దుల్ నాసిర్ అబుబాకర్ చెప్పారు. కాగా, రెండు వారాల ఈ ఒప్పందంలో లెబనాన్ లో పోరాటాన్ని నిలిపివేయడం కూడా ఒక భాగమని ఇరాన్ పట్టుబట్టింది. ఒకవేళ లెబనాన్ లో యుద్ధం త్వరగా ఆగకపోతే, చర్చలు ఆగిపోతాయని తస్నిమ్ వార్తా సంస్థ వెల్లడించింది.
చర్చలకు ఇజ్రాయెల్, లెబనాన్ ఓకే..
ఇజ్రాయెల్ బాంబు దాడుల వల్ల అమెరికా-–ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ దెబ్బతింటుందనే ఆందోళనల మధ్య, వచ్చే వారం వాషింగ్టన్‌లో చర్చలు జరపడానికి ఇజ్రాయెల్, లెబనాన్ అంగీకరించాయని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ఇజ్రాయెల్‌తో చర్చలకు కూర్చోవడానికి ముందే తమకు శాంతి కావాలని లెబనాన్ ప్రభుత్వ అధికారి ఒకరు ఏఎఫ్పీ వార్తా సంస్థకు చెప్పారు. వచ్చే వారం జరగబోయే చర్చల గురించి ఇజ్రాయెల్ లేదా లెబనాన్ ఇప్పటివరకు ఎటువంటి ధ్రువీకరణ ఇవ్వలేదు.
