గాజా స్ట్రిప్: సీజ్‌ఫైర్ ఒప్పందం అమలులో ఉన్నా గాజాపై ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడింది. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదేశాల మేరకు ఇజ్రాయెల్ ఆర్మీ మంగళవారం రాత్రి గాజాపై ఎయిర్ స్ట్రయిక్‌లకు దిగింది. ఈ దాడుల్లో 46 మంది పిల్లలు సహా మొత్తం 104 మంది చనిపోయినట్లు పాలస్తీనా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. మరో 253 మంది గాయపడ్డారని తెలిపింది. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు వివరించింది.
గాజా సిటీ, ఖాన్ యూనిస్, దెయిర్ అల్-బలహ్, నుసైరాత్ ప్రాంతాల్లో దాడులు జరిగాయని పేర్కొంది. ఇజ్రాయెల్ సీజ్‌ఫైర్‌ను మాటిమాటికీ ఉల్లంఘిస్తోందని హమాస్ ఆరోపించింది. దాడులు కొనసాగిస్తే ఇజ్రాయెల్ బందీల మృతదేహాల అప్పగింతను ఆలస్యం చేస్తామని హెచ్చరించింది. హమాసే ముందుగా సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించిందని ఐడీఎఫ్ తెలిపింది.
