తమిళనాడులో పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు బంద్ 

తమిళనాడులో పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు బంద్ 

చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు నీట మునిగాయి. చెన్నై, మయిలడుతురై, కడలూరు, నాగపట్టణం, కాంచీపురం, తిరువల్లూరు జిల్లాల్లో 7 నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెంగల్ పట్టు, విల్లుపురం, తంజావూరు, రామనాథపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. వర్షాల కారణంగా చెన్నై సహా 23 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. మరో 6 జిల్లాల్లో స్కూళ్లు బంజేశారు. భారీ వర్షాలతో రిజర్వాయర్లు నిండిపోయాయి. జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని మంత్రి కేఎన్ నెహ్రూ చెప్పారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. 2 వేల మంది సిబ్బంది రెడీగా ఉన్నారని వెల్లడించారు. భారీ వర్షాలకు పుదుచ్చేరిలోనూ అన్ని కాలేజీలు, స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 

5 వేల షెల్టర్ జోన్లు

భారీ వర్షాలకు చెన్నై నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లో వరద చేరింది. ట్రాఫిక్ నిలిచిపోయింది. రాష్ట్రంలో 5,093 షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

వర్షంలో లగ్గం..

భారీ వర్షాల కారణంగా చెన్నైలో లగ్గాలు ఆలస్యమయ్యాయి. ఇక్కడి పులియన్ తోప్ ఏరియాలోని ఆంజినేయర్ ఆలయంలో శుక్రవారం ఐదు లగ్గాలు జరగాల్సి ఉండగా, ఆలయంలోకి వరద రావడంతో అనుకున్న ముహూర్తానికి లగ్గాలు జరగలేదు. ఓ జంట లగ్గం చేసుకునేందుకు వర్షంలో ఛెత్రి పట్టుకొని ఆలయానికి వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.