సమైక్యతా ఉత్సవాలంటూ చరిత్రను వక్రీకరిస్తున్నరు

సమైక్యతా ఉత్సవాలంటూ చరిత్రను వక్రీకరిస్తున్నరు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమ సమయంలో అప్పటి సీఎంలను నిలదీసిన కేసీఆర్.. నిన్న మొన్నటి వరకు దాని ఊసే ఎత్తకుండా, ఇప్పుడు ‘‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రకటన చేయడం ఏమిటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. కేంద్రం నిర్ణయంతో దిగివచ్చే ఈ ప్రకటన చేశారని, అయితే.. చరిత్రను వక్రీకరించేందుకే సమైక్య దినోత్సవంగా కేసీఆర్​ చెప్తున్నారని మండిపడ్డారు. దారుసలం నుంచి ప్రకటన వచ్చాకే సమైక్యతా ఉత్సవాలు అంటూ ప్రకటన చేశారని, ఒవైసీ ఆదేశాలు మాత్రమే టీఆర్ఎస్, కాంగ్రెస్  పాటిస్తాయని విమర్శించారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎం ఆదేశాలను కేసీఆర్ పాటించడం సిగ్గుచేటు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒవైసీ జై తెలంగాణ అనలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలి” అని అన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో బండి సంజయ్​ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ , ఎంఐఎం, కాంగ్రెస్ వంటి గుంట నక్క పార్టీలన్నీ ఇప్పుడు ఏకమయ్యాయని, వీరికి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని హెచ్చరించారు. ‘‘తెలంగాణ మహిళలను అవమానపరుస్తూ.. వారితో బతుకమ్మలాడించిన నిజాం చరిత్రను కేసీఆర్ మరిచిపోయాడా? అలాంటి నిజాం సమాధి కాళ్ల ముందు మోకరిల్లిన చరిత్ర కేసీఆర్ ది కాదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి సెప్టెంబర్​ 17 విమోచన దినోత్సవాలను అధికారికంగా ఎందుకు జరపటం లేదు? దీని వెనుక ఉన్న మతలబు ఏమిటి?” అని ప్రశ్నించారు. ఇప్పుడు సమైక్యతా ఉత్సవాలు అంటూ చరిత్రను కేసీఆర్​ వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘ఇన్ని రోజులు జెండా ఎందుకు ఎత్తలేదు... ఇప్పుడెందుకు ఎత్తుతున్నరు? ఇటువంటి దగుల్బాజీ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. ఓట్ల కోసం, సీట్ల కోసం కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నడు. ఒవైసీని ముందుగా జాతీయ గీతం పాడాలని కేసీఆర్  చెప్పాలి” అని పేర్కొన్నారు. కాగా, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర పర్యాట, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఒక ప్రకటనలో సంజయ్  తెలిపారు. 

సెప్టెంబర్​ 17 వేడుకలు  శుభపరిణామం: విద్యాసాగర్
సెప్టెంబర్​ 17 వేడుకలను ఇప్పుడు అన్ని పార్టీలు నిర్వహించుకోవాలని నిర్ణయించడం శుభ పరిణామమని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. 20 ఏండ్ల కింద తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలనే డిమాండ్ ను తామే ప్రారంభించామని తెలిపారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆనాడు సెప్టెంబర్ 17 ను అధికారికంగా విమోచన దినంగా నిర్వహించాలని కోరితే ఇతర పార్టీల వారు నవ్వేవారని అన్నారు.