
లండన్/ఇస్లామాబాద్: ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చింది నిజమేనని పాకిస్తాన్ మరోసారి ఒప్పుకుంది. టెర్రరిస్టులను ప్రోత్సహించామని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల పేర్కొనగా.. అది నిజమేనని ఆ దేశ నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ తాజాగా అంగీకరించారు. గురువారం బ్రిటన్ మీడియా ‘స్కై న్యూస్’ ఇంటర్వ్యూలో పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలను అంగీకరిస్తారా? అని జర్నలిస్టు ప్రశ్నించగా.. ‘‘అవును.. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన చరిత్ర పాకిస్తాన్‌కు ఉంది. అదేమీ సీక్రెట్ కాదు. కానీ దాని వల్ల మేం కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పాకిస్తాన్ నష్టపోయింది. అయితే, అది చరిత్ర మాత్రమే. ఆ చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకున్నాం.
ఈ సమస్య పరిష్కారానికి అంతర్గత సంస్కరణలు చేపట్టాం” అని బిలావల్ సమాధానమిచ్చారు. ‘‘పాకిస్తాన్‌కు తీవ్రవాద చరిత్ర ఉన్నది నిజమే. కానీ అది ముగిసిన అధ్యాయం. చరిత్రలో ఒక భాగం.. అదొక దురదృష్టకరమైన భాగం” అని పేర్కొన్నారు.