పొంగులేటి ఇండ్లలో ముగిసిన ఐటీ సోదాలు.. పలు డాక్యుమెంట్స్ స్వాధీనం

పొంగులేటి ఇండ్లలో ముగిసిన ఐటీ సోదాలు.. పలు డాక్యుమెంట్స్ స్వాధీనం
  • శుక్రవారం మధ్యాహ్నం వరకు రెయిడ్స్​
  • బ్యాంక్ అకౌంట్స్‌‌ పరిశీలన

హైదరాబాద్‌‌/ఖమ్మం, వెలుగు: పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇండ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు శుక్రవారం ముగిశాయి. జూబ్లీహిల్స్‌‌ రోడ్‌‌ నంబర్ 17లోని పొంగులేటి నివాసం, నందగిరి హిల్స్‌‌, వంశీరామ్‌‌ జ్యోతి హిల్‌‌ రిడ్జ్‌‌లోని ఫ్లాట్‌‌, బంజారాహిల్స్‌‌ రోడ్‌‌ నంబర్ 10లోని రాఘవ ప్రైడ్‌‌, బేగంపేటలోని ఆఫీసులో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. సిటీలో దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఖమ్మంతో పాటు హైదరాబాద్‌‌లో గురువారం తెల్లవారుజామున ప్రారంభమైన తనిఖీలు శుక్రవారం మధ్యాహ్నం వరకు జరిగాయి. పొంగులేటి నివాసంలో సోదాల అనంతరం ఐటీ అధికారులు రెండు బ్యాగులలో డాక్యుమెంట్లు తీసుకెళ్లారు.

మాస్టర్ బెడ్రూం తాళాలు  పగులగొట్టి డాక్యుమెంట్లు సీజ్!

సోదాలు జరుగుతున్న సమయంలో శ్రీనివాస్‌‌రెడ్డితో పాటు ఆయన భార్య ఖమ్మంలో ఉన్నారు. దీంతో జూబ్లీహిల్స్‌‌ నివాసంలోని మాస్టర్ బెడ్‌‌రూమ్‌‌ తాళాలు ఐటీ అధికారులకు లభించలేదు. కీస్‌‌ తీసుకొని రావాలని శ్రీనివాస్ రెడ్డి భార్యకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం కూడా ఆమె  హైదరాబాద్ చేరుకోలేదు. పలుమార్లు సెర్చ్‌‌ వారెంట్‌‌ పంపించినప్పటికీ స్పందించలేదు. దీంతో ఐటీ అధికారులు మాస్టర్‌‌‌‌ బెడ్‌‌రూమ్‌‌ తాళాలు పగులగొట్టినట్లు తెలిసింది. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, పనిమనుషుల సమక్షంలో తనిఖీలు చేశారు. ఇంట్లో లాకర్‌‌‌‌లో దాచిన పలు డాక్యుమెంట్లు సీజ్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంక్ అకౌంట్స్‌‌ను సేకరించి ఆర్థికలావాదేవీలను పరిశీలిస్తున్నారు.

ఐటీ అధికారులు పరిధి దాటి ప్రవర్తించారు : పొంగులేటి

తమ ఇండ్లు, ఆఫీసుల్లో సోదాల విషయంలో ఐటీ అధికారులు పరిధి దాటి ప్రవర్తించారని పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. శుక్రవారం ఖమ్మంలోని తన క్యాంప్​ కార్యాలయంలో సీపీఐ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తన అల్లుడు రామసహాయం అర్జున్ రెడ్డిపై చేయి చేసుకున్నారని, అమెరికా రిటన్​​ వెళ్లకుండా జీవితాంతం జైళ్లో ఉండాల్సి వస్తుందంటూ బెదిరించారని తెలిపారు. రాఘవ కన్ స్ట్రక్షన్స్​ మేనేజర్​ జయ ప్రకాశ్​ ను అరగంట పాటు కుర్చీ మీద ఒంటి కాలిపై నిలుచోబెట్టారని పొంగులేటి ఆరోపించారు. చేయి చేసుకునే అధికారం ఐటీ అధికారులకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ''30 ప్రాంతాల్లో 400 మంది ఐటీ అధికారులు రెయిడ్స్​ జరిపారు. మేము చెప్పినట్టు వినకపోతే జీవితాంతం జైలులో పెడతామని మా వాళ్లను బెదిరిస్తున్నారు. ఇవ్వాళ అధికారంలో ఉన్న పార్టీకి అధికారులు వత్తాసు పలికితే.. రేపు దోషులుగా నిలబడాల్సి వస్తుంది..” అని పొంగులేటి చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు కష్టపడి పని చేయాలని ఆయన కోరారు.