
- పలు కీలక డాక్యుమెంట్లు, డైరీలు స్వాధీనం
- 49 లక్షల నగదు పట్టుకున్నట్లు సమాచారం
నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికా రులు సోదాలు నిర్వహించారు. నల్గొండలోని తిరుమల నగర్లో ఆయన నివాసం ఉంటున్న ఇంట్లో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు తనిఖీలు జరిగాయి. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దాదాపు 30 మంది పైగా ఐటీ ఆఫీసర్లు, సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా నల్గొండ, సూర్యాపేట జిల్లా ఆఫీసర్లను నోడల్అధికారులుగా నియమించారు. వీరితోపాటు, ఢిల్లీ, చెన్నై ప్రాంతాలకు చెందిన డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులను ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమించారు. అయితే పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు దాచిపెట్టారన్న ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌కు చెందిన పలువురు ఐటీ ఉన్నతాధికారులు, నోడల్ అధికారులు కలిసి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లు, డైరీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విశ్వనీయ సమాచారం మేరకు రూ.49 లక్షల నగదును సీజ్ చేశారని సమాచారం. అయితే అధికారులు దీనిని ధ్రువీకరించలేదు. రాత్రి 11 గంటల వరకు సోదాలు కొనసాగుతుండటంతో ప్రభాకర్ రెడ్డి ఇంటి సమీపంలో స్థానిక పోలీసులు, మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున గుమిగూడారు.
సీడ్స్ కంపెనీల్లో ఐటీ సోదాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఆగ్రో టెక్ కంపెనీలపై ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్(ఐటీ) ఫోకస్ పెట్టింది. సికింద్రాబాద్ మినర్వా కాంప్లెక్స్‌లోని కావేరీ సీడ్స్, ఆదిత్యా ఆగ్రో, బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ సీడ్ కంపెనీ ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సెంట్రల్ ఫోర్సెస్ సెక్యూరిటీతో సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 వరకు తనిఖీలు చేశారు. ఈ సమయంలో ఆఫీస్ స్టాఫ్‌ను బయటకు పంపించారు. సంబంధిత సిబ్బంది స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. ఆఫీసుల్లోని కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, రికార్డులు, బ్యాంక్ ఆడిట్ బుక్స్ సహా కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత వాటిని బషీర్‌బాగ్‌లోని ఐటీ ఆఫీస్‌కి తరలించారు. సోదాలకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు వెల్లడించలేదు. మంగళవారం కూడా తనిఖీలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సికింద్రాబాద్, బంజారాహిల్స్‌తోపాటు నల్గొండలో జరిగిన సోదాల్లో మొత్తం 30 మంది ఐటీ అధికారులు పాల్గొన్నారు.