
న్యూఢిల్లీ: క్షేత్రస్థాయిలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. ప్రతిపక్షాలన్నీ గట్టిగా నిలబడితే.. 2024 ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడం కష్టమవుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అయితే అపోజిషన్ సరిగ్గా కోఆర్డినేట్ చేసుకోవాలని.. సరికొత్త విజన్‌తో ప్రజల ముందుకెళ్లాలని సూచిం చారు. శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో రాహుల్ మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘‘జోడో యాత్రకు ప్రతిపక్షాలు అండగా ఉన్నాయి. కానీ ప్రస్తుత వాతావరణంలో వాటికి రాజకీయ, ఇతర ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. ఈ కారణంతో అవి యాత్రలో చేరడం లేదు. హింస, ద్వేషంలేని సమైక్య భారతదేశాన్ని కోరుకునే వాళ్లకు.. ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి” అని రాహుల్ స్పష్టం చేశారు.
ఒకే ఐడియాలజీ డామినేషన్
ప్రాంతీయ పార్టీలకు లేని.. కాంగ్రెస్‌కు మాత్రమే ఉన్న జాతీయ ఐడియాలజీని దేశ ప్రజల కోసం ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష పార్టీలు తీసుకురావాలని రాహుల్ పిలుపు నిచ్చారు. ‘‘ఇది వ్యూహాత్మక రాజకీయ యుద్ధం ఎంతమాత్రమూ కాదు. కొన్ని గ్రూపులు చేరడం, బీజేపీని ఓడించడం అనేదంతా గతం. దేశంలోని పొలిటికల్ స్పేస్ మొత్తాన్ని ఒకే ఐడియాలజీ డామినేట్ చేస్తున్నది. వాళ్లను ఓడించడానికి.. ప్రత్యామ్నాయం అవసరం. అదే సమయంలో ప్రతిపక్ష నేతలను సౌకర్యవంతంగా చూసుకునే బాధ్యత మాపై ఉంది” అని చెప్పుకొచ్చారు. కాగా, బీజేపీని తన గురువుగా భావిస్తున్నానని రాహుల్ గాంధీ అన్నారు. ‘అస్సలు చేయకూడనిపనులను బీజేపీని చూసి నేర్చుకున్నట్లు’ చెప్పారు. తన భవిష్యత్తుకు రోడ్ మ్యాప్‌ను కూడా బీజేపీయే చూపిస్తోందని రాహుల్ సెటైర్ వేశారు.