ఆర్టీసీలో 8 సంఘాలతో జేఏసీ

ఆర్టీసీలో 8 సంఘాలతో జేఏసీ
  • చైర్మన్​గా టీఎంయూ గౌరవ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన పీఆర్సీలు, సీసీఎస్ బకా యిలు విడుదల చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. రెండు పీఆర్సీలు, మరో పీఆర్సీ బకాయిలు ఉండటంతో 10 ఏండ్ల నుంచి కార్మికుల జీతాలు పెరగలేదన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులపై అధికారుల వేధింపులు ఆపాలన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీఎంయూ గౌరవ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి చైర్మన్​గా, టీజేఎంయూ జనరల్ సెక్రటరీ హన్ముంతు ముదిరాజ్ కన్వీనర్ గా జేఏసీ ఏర్పాటయింది. జేఏసీలో ఉన్న ఇతర ఆరు సంఘాల ( ఎన్ఎంయూ, బీఎంఎస్, ఐఎన్ టీయూసీ, బీడబ్ల్యూయూ, టీఎన్టీయూసీ, ఎస్టీఎంయూ)  ముఖ్య నేతలను కో కన్వీనర్లుగా నియమించారు. మూడు గంటల పాటు కార్మికుల సమస్యలు, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు, రిటైర్ అయిన కార్మికులకు బెనిఫిట్స్ ఇవ్వకపోవడం వంటి సమస్యలపై నేతలు చర్చించారు. 

యూనియన్లు లేకపోవటంతో అధికారులు కార్మికులను వేధిస్తున్నారని, అవి తట్టుకోలేక పలువురు కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నేతలు తెలిపారు. మునుగోడు బై పోల్ టైమ్ లో ఆర్టీసీ కార్మికుల ఓట్ల కోసం పీఆర్సీ ఇస్తామని చెప్పి.. ఆ తరువాత ఆర్టీసీని పట్టించుకోవటం లేదన్నారు. బడ్జెట్​లో ఆర్టీసీకి కేటాయించిన నిధులును పూర్తిగా విడుదల చేయటం లేదని, బస్​పాస్ రియింబర్స్ మెంట్ నిధులు కూడా విడుదల చేయటం లేదని నేతలు ఆరోపించారు. కార్మికుల సమస్యలపై వచ్చే నెల 1న మరో సారీ సమావేశమై పోరాట కార్యాచరణను ప్రకటిస్తామని అశ్వత్థామరెడ్డి, హనుమంతు ముదిరాజ్ లు వెల్లడించారు. 

కాగా ఈ జేఏసీలో ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న టీఎంయూ (థామస్ రెడ్డి వర్గం) లెఫ్ట్ పార్టీల యూనియన్లు ఎంప్లాయిస్ యూనియన్, ఎస్ డబ్ల్యూఎఫ్ లు దూరంగా ఉన్నాయి. ఆ మూడు యూనియన్లు కూడా జేఏసీ లో చేరాలని, అందరం కలిసి ఐక్యంగా కార్మికుల సమస్యలపై పోరాటాలు చేద్దామని నేతలు పిలుపునిచ్చారు.