ఆర్టీసీని మాకివ్వండి..రెండేళ్లలో సెట్ చేస్తం

ఆర్టీసీని మాకివ్వండి..రెండేళ్లలో సెట్ చేస్తం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాయితీల సొమ్మును ఎప్పటికప్పుడు విడుదల చేసి, నష్టాల రూట్లలో ట్యాక్స్‌‌‌‌‌‌‌‌మినహాయించి సంస్థను తమకు అప్పగిస్తే రెండేండ్లలో ఆర్టీసీని బలోపేతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఉద్యోగుల జీతం నుంచి రికవరీ చేసిన పీఎఫ్​ సొమ్ము, సీసీఎస్​ విడుదల చేసి సర్కారు చెప్పినట్టే రెగ్యులేటరీ అథారిటీని నియమిస్తే చాలని పేర్కొంది. రాష్ట్ర పెద్దగా సీఎం ఆర్టీసీ కార్మికులను తమ పిల్లలుగా భావించాలని.. ఎలాంటి అరెస్టులు, క్రమశిక్షణ చర్యలు లేకుండా వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని కోరింది. లేకపోతే మరిన్ని సమస్యలొస్తాయని, ఆర్టీసీలో అశాంతి పెరిగిపోతుందని పేర్కొంది. సీఎం దయ తలచాలని, ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించడానికి వెంటనే కార్మికులను డ్యూటీలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం జేఏసీ ప్రెస్‌‌నోట్‌‌విడుదల చేసింది.

సర్కార్‌‌‌‌‌‌‌‌, ఆర్టీసీనే సమ్మెలోకి నెట్టినయ్‌‌‌‌‌‌‌‌

ప్రభుత్వం, ఆర్టీసీ మేనేజ్​మెంట్​ కావాలనే కార్మికులను బలవంతంగా సమ్మెలోకి నెట్టాయని.. పండుగ టైంలో ప్రజలకు ఇబ్బంది కలిగిందని ఆర్టీసీ జేఏసీ చెప్పింది.ఆర్టీసీని ప్రైవేట్‌‌‌‌‌‌‌‌పరం చేయాలనే దురాలోచనతో సమ్మె ఇల్లీగల్‌‌‌‌‌‌‌‌అంటున్నారని.. సమ్మె ఇల్లీగల్‌‌‌‌‌‌‌‌కాదని, ఎస్మా చట్టం వర్తించదని హైకోర్టు ఎంత చెప్పినా సర్కారు, మేనేజ్​మెంట్​ పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించింది. కార్మికులను డ్యూటీలోకి తీసుకోవాలన్న కోర్టు సూచనను ఇన్​చార్జి ఎండీ పెడచెవిన పెట్టారంది.

వాస్తవాలకు దూరంగా సునీల్‌‌‌‌‌‌‌‌శర్మ ప్రకటన

కార్మికుల సమ్మె విరమణపై ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి ఎండీ సునీల్‌‌‌‌‌‌‌‌శర్మ చేసి ప్రకటన వాస్తవాలకు దూరంగా ఉందని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. ఇష్టమొచ్చినప్పుడు సమ్మె చేసి, తిరిగి ఇష్టమొచ్చినప్పుడు డ్యూటీకి వస్తానంటారా అంటూ ఓ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ అధికారి పేర్కొనడం బాధాకరమని తెలిపింది. దసరాకు నెల ముందే సమ్మె నోటీసు ఇచ్చినా ఈడీ, ఎండీ పరిధిలో చర్చలు జరపలేదని.. లేబర్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌కూడా కన్సీలియేషన్‌‌‌‌‌‌‌‌ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ద్వారా మధ్యవర్తిత్వం వహించకపోవడం  చిత్రమని పేర్కొంది. కన్సీలియేషన్‌‌‌‌‌‌‌‌తేదీ ప్రకటించి కారణం లేకుండా రద్దు చేశారని.. తేదీ ప్రకటించాలని కన్సీలియేషన్‌‌‌‌‌‌‌‌ఆఫీసర్‌‌‌‌‌‌‌‌కు జేఏసీ విజ్ఞప్తి చేసినా స్పందించలేదని వివరించింది. గత్యంతరం లేక సమ్మె తేదీని ప్రకటించామని తెలిపింది. కార్మికులు సమ్మె చేయడం అంటే.. సమస్యల పరిష్కారం కోసం పోరాటమే తప్ప ఉద్యోగాన్ని వదులుకోవడం కాదని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉందని గుర్తు చేసింది.

ఎందుకు తీసుకోవట్లే?

హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు.. జనం ఇబ్బందులను, సంస్థ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని డ్యూటీలకు వస్తామని కార్మికులు ముందుకొచ్చారని.. అయినా చేర్చుకోబోమనడం తీవ్రంగా కలిచివేస్తోందని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది.

నేడు రాస్తారోకోలు, నిరసనలు

అఖిలపక్షం నిర్ణయం

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష పార్టీలు ఉమ్మడి ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించాయి. సమ్మె విరమించిన కార్మికులను డ్యూటీలోకి  తీసుకోవాలని, ఆర్టీసీని పరిరక్షించాలనే డిమాండ్‌‌తో బుధవారం నుంచి అఖిలపక్షం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు, కలెక్టరేట్ల ముట్టడి చేపట్టాలని పిలుపునిచ్చాయి. ఆర్టీసీ కార్మికులపై సర్కార్‌‌నిర్బంధం, డ్యూటీలో చేరేందుకు వెళ్లిన కార్మికుల అరెస్టు, సమ్మె అనంతర పరిణామాలపై చర్చించేందుకు హైదరాబాద్‌‌లోని గోల్కొండ హోటల్‌‌లో కాంగ్రెస్‌‌, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ, టీజేఎస్‌‌, న్యూడెమోక్రసీ పార్టీల నేతలు మంగళవారం రాత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం అమానవీయంగా వ్యవహరించడాన్ని అఖిలపక్ష నేతలు తప్పుపట్టారు. ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై చర్చించిన నాయకులు ఈ కార్యాచరణను బుధవారం ప్రకటించాలని నిర్ణయించారు.