జీవన్ రెడ్డికి పార్టీలో అవమానం జరగకుండా చూడాలి : జగ్గారెడ్డి

జీవన్ రెడ్డికి పార్టీలో అవమానం జరగకుండా చూడాలి : జగ్గారెడ్డి
  • పార్టీ ఇన్‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్​కు జగ్గారెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌‌ సీనియర్ నేత జీవన్ రెడ్డికి పార్టీలో అవమానం జరగకుండా చూడాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌‌కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పదేండ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పార్టీకి అండగా నిలిచారని గుర్తుచేశారు.

ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆయన్ను అవమానించడం, అన్యాయం చేయడం సరికాదన్నారు. జీవన్ రెడ్డికి రాజకీయంగా ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినా...కాంగ్రెస్ నే నమ్ముకొని పనిచేశారని చెప్పారు. అలాంటి నేతకు పార్టీలో సముచితమైన స్థానం ఇచ్చి గౌరవించాలని కోరారు. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో జీవన్ రెడ్డి జగిత్యాలలో ఎమ్మెల్యేగా ఓడిపోయారని, దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి గౌరవించాలని మీనాక్షి నటరాజన్ ను జగ్గారెడ్డి కోరారు.