ఐఏఎస్‌ లే మంత్రులా.. మంత్రి లేడా?

ఐఏఎస్‌ లే మంత్రులా.. మంత్రి లేడా?

సమ్మెను అణచాలని ముందే అనుకున్నరు: జగ్గారెడ్డి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ‘ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన కాసేపటికే సంస్థ ఎండీ ప్రకటన చేశారు. కార్మికులను అణగదొక్కే ప్రణాళిక సర్కారు దగ్గర ముందే ఉందని దీన్ని బట్టి అర్థమవుతోంది. అయినా ఐఏఎస్‌‌‌‌లే మంత్రులా? ప్రకటన మంత్రి చేస్తారా? అధికారులా?’ అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం ప్రశ్నించారు. ‘ఏ డిపోలో చూసినా పోలీసులే. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, పోలీసులే బతకాలా.. ప్రజలు బతకొద్దా’ అని నిలదీశారు. ఆకలవుతోందని చెప్పే హక్కు కూడా రాష్ట్రంలో లేదా అని అడిగారు. రాష్ట్ర ఉద్యమం టైంలో స్పీచులిచ్చి ఆర్టీసీ ఉద్యోగులను రెచ్చగొట్టిన మల్లెపల్లి లక్ష్మయ్య, గంటా చక్రపాణి, దేవీప్రసాద్, శ్రీనివాస్‌‌‌‌గౌడ్, స్వామి గౌడ్ ఇప్పుడు ఏమయ్యారన్నారు. ‘ఉద్యోగ సంఘాల నేతలు రవీందర్, మమత కేసీఆర్ ఇంటి దగ్గరే కనబడుతున్నరు. ఉద్యమ నాయకులకు సిగ్గనిపిస్తలేదా? మీ ఓంట్లో ఉన్నది రక్తమేనా’ అని మండిపడ్డారు. కార్మికులను తొలగిస్తే తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలిస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు.