
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్నాయకులకు వాళ్ల ఎమ్మెల్యేలు పార్టీ జంప్ అవుతారన్న భయం పట్టుకుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. త్వరలోనే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని వారికి తెలిసిందని, వారిని కాపాడుకునేందుకే పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, కేసీఆర్ఆరు నెలల్లో సీఎం అవుతారని కేటీఆర్, హరీశ్అంటున్నారని ఆయన విమర్శించారు. బుధవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయ సందిగ్ధంలో ఉందని జగ్గారెడ్డి అన్నారు.
గత తొమ్మిదేండ్లలో సీఎం, మంత్రులెవరూ సెక్రటేరియెట్కు రాలేదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఎదగొద్దని కేటీఆర్, హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాము తలచుకుంటే అతి త్వరలోనే 20 మంది ఎమ్మెల్యేలను లేపుకొస్తామని, కేసీఆర్ పక్కన పడుకున్నా తీసుకొచ్చేస్తామని జగ్గారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసే కుట్రలకు ప్రతికుట్రలను తామూ చేయగలమని అన్నారు. కేసీఆర్, గత ఎమ్మెల్యేలు జగన్కు రూ.వెయ్యి కోట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు.
విజయసాయి రెడ్డిపై ఫైర్
కేసీఆర్, జగన్.. ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్లో నడుస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. విజయ సాయిరెడ్డి బీజేపీతో కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే వకాల్తా తీసుకున్నట్టున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ ఆయన రాజ్యసభలో మాట్లాడారని మండిపడ్డారు. ‘‘విజయసాయి రెడ్డి.. నువ్వేమైనా బ్రోకర్ దుకాణం పెట్టావా? నీకేమైనా విలువలు ఉన్నాయా? నువ్వు కేసీఆర్ కాళ్లు మొక్కావు. వైఎస్సార్ కొడుకు జగన్ రెడ్డి ఆత్మ అయిన విజయసాయి రెడ్డి.. కేసీఆర్ కాళ్లు మొక్కుడు ఏంది. కాంగ్రెస్ వల్లే వైఎస్ జగన్కు పాలించే అవకాశం వచ్చింది. వ్యాపార రంగంలో ఉన్నోళ్లను గందరగోళంలో పడేసేందుకు కేటీఆర్, హరీశ్, విజయసాయి కుట్రలు చేస్తున్నారు. వారి కుట్రలను తిప్పి కొడతాం’’ అని జగ్గారెడ్డి హెచ్చరించారు.