న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూంలో ఈ సిగరెట్ వేపింగ్ చేస్తూ అడ్డంగా పట్టుబడ్డాడు. నిబంధనలకు విరుద్ధంగా పరాగ్ బహిరంగంగా నిషేధిత ఈ సిగరెట్ తాగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ రియాన్ పరాగ్‌ను వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
పరాగ్ రిప్లై తర్వాత అతడిపై బీసీసీఐ యాక్షన్ తీసుకోనుంది. అయితే, పరాగ్ చేసిన పని కేవలం క్రీడా నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు.. భారత చట్టాల ఉల్లంఘన కూడా. ఎందుకంటే దేశంలో ఎలక్ట్రానిక్ సిగరెట్ బ్యాన్. దేశంలో ఈ సిగరెట్ అమ్మకాలు, వినియోగం, నిల్వలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో పరాగ్ చేసిన పని క్రీడా నియమాల ఉల్లంఘనే కాకుండా చట్టపరమైన అంశంగా కూడా మారింది.
ఈ సిగరెట్ల నిషేధ చట్టం 2019 ప్రకారం.. దేశంలో ఈ-సిగరెట్ల తయారీ, విక్రయం, నిల్వ, వినియోగం, ప్రకటన పూర్తిగా నిషేధం. మొదటిసారి ఈ చట్టాన్ని ఉల్లంఘించినవారికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా రూ.1 లక్ష వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. దీంతో తొలిసారి తప్పు చేసిన పరాగ్ ను జరిమానా విధించి వదిలేస్తారా లేక జైలుకు పంపుతారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
రియాన్ పరాగ్ ఇష్యూతో డ్రెస్సింగ్ రూమ్ ప్రైవసీ అంశం మరోసారి చర్చకు దారి తీసింది. సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన కెప్టెన్ల సమావేశంలో కూడా డ్రెస్సింగ్ రూమ్ ప్రైవసీ సమస్యను ఆటగాళ్లు లేవనెత్తారు. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సమయంలో కెమెరాలు డ్రెస్సింగ్ రూమ్ వైపు పదే పదే చూపించడం వల్ల ఆటగాళ్లకు ఇబ్బందిగా మారుతోందని ఆయా జట్ల కెప్టెన్లు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. అయితే, డ్రెస్సింగ్ రూమ్ ఫీడ్‌ను కెమెరాలు లైవ్ టెలికాస్ట్ చేయడంపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రసారకర్తలే తప్ప బీసీసీఐ కాదని కెప్టెన్ల ఫిర్యాదును బీసీసీఐ సున్నితంగా తిరస్కరించింది.

