ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19లో అదరగొడుతున్న యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ క్రికెటర్ ఛతేశ్వర పూజారా ప్రశంసల వర్షం కురిపించారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ అచ్చం సూపర్ థ్రిల్లర్ సినిమాలా ఉంటుందని కొనియాడారు. ఎంతటి గొప్ప బౌలర్‌నైనా ఎలాంటి భయం లేకుండా అతడు ఎదుర్కొనే విధానం అద్భుతమని కితాబిచ్చారు. బౌలర్ ఎవరనే సంబంధం లేకుండా కేవలం బంతిని చూసి బలంగా కొట్టడమే అతని స్టైల్ అని చెప్పారు. వైభవ్ దూకుడుగా ఆడతాడని తెలిసిన ప్రత్యర్థులు అతడిని కట్టడి చేయడానికి ఇబ్బంది పడటం విశేషమన్నారు. వైభవ్ నిలకడ, పవర్‌ప్లేలో అతని నిర్భయమైన బ్యాటింగ్ ప్రత్యర్థులపై పై చేయి సాధించి జట్టు విజయానికి పునాదులు వేస్తుందని ప్రశంసించారు.
కాగా, ఐపీఎల్ 19లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 28) పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్ధేశించిన 223 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఆర్ఆర్ ఛేధించింది. 223 పరుగుల విజయవంతమైన ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లో 43 పరుగులు చేసి ఛేజింగ్‌లో ఆర్ఆర్కు మంచి స్టార్ట్ అందించాడు.
ఓవరాల్‌గా కూడా ఈ సీజన్లో 15 ఏళ్ల 15 వైభవ్ దుమ్మురేపుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడిన ఈ చిచ్చర పిడుగు 238 స్ట్రైక్ రేట్, 44 సగటుతో 400 పరుగులు చేసి లీగ్‌లో అత్యధిక రన్స్ చేసిన జాబితాలో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ ఈ 15 ఏళ్ల బుడ్డోడి దగ్గరే ఉండటం విశేషం. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడి ఆరు విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆర్ఆర్ విజయాల్లో వైభవ్ సూర్యవంశీది కీలక పాత్ర.

